భారత్ రికార్డును బద్దలు చేసేసిన బంగ్లాదేశ్

అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచకప్ కబడ్డీ టోర్నీలో సోమవారం నాడు రాత్రి అత్యంత అరుదైన రికార్డు నమోదు అయింది. కబడ్డీ ప్రపంచకప్ టోర్నీలోనే అత్యంత అరుదైన రికార్డు గా రెండు రోజుల కిందట భారత్ సాధించిన విజయాన్ని సోమవారం నాటి బంగ్లాదేశ్ విజయం మరపించింది. భారత్ సాధించిన రికార్డే తిరుగులేనిదని అనుకుంటూ మొన్నటికి క్రీడాభిమానులంతా మురిసిపోతూ ఉంటూ.. బాంగ్లాదేశ్ మెరుపులు మెరిపించిన ఆటతీరుతో ఆ రికార్డును తుత్తునియలు చేసింది. కబడ్డీ పసికూనలనే హోదాలో తమతో తలపడిన ఆస్ట్రేలియా జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది.
రెండురోజుల కిందట భారత్ అర్జంటీనా మీద విజయం సాధించి.. సెమీస్కు తన బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. అయితే అనుకోకుండా ఆ మ్యాచ్లో ఓ అరుదైన రికార్డును కూడా భారత్ సాధించింది. అర్జంటీనా ను ఏకంగా 54 పాయింట్ల వ్యత్యాసంతో భారత్ ఓడించింది. కబడ్డీ ప్రపంచకప్ టోర్నీలు మొదలయ్యాక.. ఏ జట్టూ సాధించని అపురూపమైన విజయం ఇది. అతి పెద్ద స్కోరులోని వ్యత్యాసం ఇది.
అయితే అలాంటి రికార్డును సాధించిన ఆనందం భారత్కు రెండు రోజులైనా పూర్తిగా నిలవలేదు. సోమవారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడిన బాంగ్లాదేశ్ ఏకంగా 80-8 పాయింట్ల తేడాతో చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఒక రకంగా బాంగ్లాదేశ్ తో ఆడడం గురించి ఆస్ట్రేలియా బెదిరిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఏకంగా 72 పాయింట్ల తేడాతో బాంగ్లాదేశ్ విజయం సాధించింది. ఆసీస్ సాధించిన 8 పాయింట్లలో వారు రెయిడ్ ల ద్వారా సాధించిన ఒకే ఒక్క పాయింట్ కావడం విశేషం. కొన్ని టాకిలింగ్ ద్వారా సాధించిన పాయింట్లు కాగా, కొన్ని పాయింట్లు సాంకేతిక కారణాల వల్ల వారికి లభించాయి. లేకపోతే.. ఇరుజట్ల మధ్య వ్యత్యాసం ఇంకా భారీగానే ఉండేది.
లీగ్ దశలో మ్యాచ్ లు ఒక కొలిక్కి వస్తున్న సమయంలో.. బంగ్లా రికార్డును మరెవరైనా బద్దలు చేస్తారో లేదో చూడాలి.

