భాజపాలో మరీ ఇన్ని తిరుగుబాట్లా?

భాజపా అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అంతా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అదంతా ఒకప్పటి మాట అనిపించేలా పరిస్థితి తయారవుతోంది. అధికారం తమ వద్ద లేకపోతే అందరూ క్రమశిక్షణ పాటిస్తూనే ఉంటారేమో.. తీరా అధికారంలో ఉన్నప్పుడు చూడాలి.. ఎవరి అసలు బుద్ధులు ఎలాంటివో ఇప్పుడు బయటపడుతోంది. ఒకవైపు నామినేటెడ్ పదవులు డిమాండ్ తో ధర్నాలు, ఆందోళన లు చేయడం జరుగుతూ ఉండగా, మరో వైపు తమ పార్టీకి చెందిన మంత్రులే అసమర్థులనీ వారు రాజీనామా చేయాలనీ డిమాండ్లు వినిపిస్తూ ఉండడం జరుగుతోంది.
ఇదంతా కూడా నామినేటెడ్ పోస్టుల వ్యవహారమే. దుర్గగుడి పాలకమండలి ఏర్పాటు వ్యవహారం భాజపాకే చెందిన దేవాదాయ శాఖ మంత్రి మీద సొంత పార్టీలో నిరసనలు రేగడానికి కారణంగా మారుతోంది. దానికి తోడు.. మంత్రిగారేమో.. పాలకమండలి నియామకం గురించి తనకేమీ తెలియదనీ.. తాను కూడా పత్రికల్లో చూసి తెలుసుకున్నాననీ వ్యాఖ్యానించడం ద్వారా ఈ ఊబిలో మరింతగా కూరుకుపోయారు.
తన సొంత శాఖలో జరుగుతున్న వ్యవహారాలు కూడా తెలియకుండా.. అసలు ఆయన పదవిలో ఉండడం ఎందుకు అంటూ విమర్శలు చెలరేగుతున్నాయి.
అయితే తమాషా ఏంటంటే చంద్రబాబునాయుడు సర్కారులో భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు మంత్రులుగా ఉన్నారు. కామినేని చంద్రబాబుకు వీర విధేయుడుగా వ్యవహరిస్తూ ఉంటారనేది జనాంతికంగా ఉన్న ప్రచారం. అదే సమయంలో పైడికొండ మాణిక్యాల రావు మాత్రం ఒక పట్టాన చంద్రబాబుకు కొరుకుడు పడని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అయితే పదవుల గొడవల పుణ్యమాని పాపం.. మాణిక్యాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు రేగుతున్నాయని పార్టీలో పలువురు అంటున్నారు.

