బౌలర్లకు జోష్... బ్యాట్స్ మెన్ మాత్రం బేజారు ...!

ప్రపంచంలోనే అతి చెత్త పిచ్ పై టీం ఇండియా, సౌత్ ఆఫ్రికా అష్టకష్టాలు పడుతున్నాయి. దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా ఆ దేశంలో మ్యాచ్ లు ఆడుతున్న ఇండియా పై పగ ప్రతీకారం ఇప్పుడు సఫారీలకే గడ్డు పరిస్థితులు తెచ్చిపెట్టింది. గతంలో ఇండియా సిరీస్ లో వైట్ వాష్ చేయించుకున్న తీరు ను గుర్తుపెట్టుకుని అదే స్థాయిలో ప్రతీకారానికి సిద్ధమైంది దక్షిణాఫ్రికా. భారత ఉపఖండంలో అప్రతిష్ట తెచ్చుకోవడానికి అక్కడి పిచ్ లే కారణమని భావించి తమ దేశంలో మ్యాచ్ లకోసం తమకు అనుకూలమైన పిచ్ లను సిద్ధం చేసింది. ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యి టీం ఇండియా రెండు మ్యాచ్ లలో పోరాటమే లేకుండా చేతులు ఎత్తేసింది. ఇక జోహెన్స్ బర్గ్ లో మరింత ఘోర పరాజయాన్ని భారత్ కి చవిచూపించాలనుకున్న సఫారీ జట్టు ఇక్కడి వికెట్ మరింత బౌన్సీగా తయారు చేయించింది. జోహెన్స్ బర్గ్ లో టీం ఇండియా ట్రాక్ రికార్డ్ బాగుండటంతో గతంలో లేని విధంగా పిచ్ తయారు చేశారు అక్కడి క్యూరేటర్. అదే ఇప్పుడు ఆతిధ్య జట్టు కొంపముంచింది.
టీం ఇండియా బౌలర్లు విజృభించారు....
తొలి రోజు ఆట ముగియకుండానే టీం ఇండియా ను 187 పరుగులకే ఆలౌట్ చేసింది సఫారీ టీం. ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి ఆరు పరుగులతో వున్న దక్షిణాఫ్రికా రెండవరోజు భారత బౌలర్ల ధాటికి 194 పరుగులకే చేతులు ఎత్తేయక తప్పలేదు. ఇదంతా మనోళ్ళ ప్రతిభ కాదని పిచ్ మహిమ అని తేలిపోయింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ పిచ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత చెత్త పిచ్ టెస్ట్ మ్యాచ్ లకు సిద్ధం చేయడం పై అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఐదు రోజుల ఆట మూడు నాలుగు రోజులకే ముగిసిపోతే టెస్ట్ క్రికెట్ కి అర్ధం ఏమిటని వెటరన్ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇండియన్ టీం లోని పుజారా తదితరులు సైతం పిచ్ ఘోరంగా ఉందన్నారు. తొలి రెండు రోజుల్లోనే పిచ్ పగుళ్లు, పచ్చిక తో చిత్తడిగా ఉందని ఇక మూడు నాలుగు రోజులు ఆట కొనసాగితే బ్యాట్స్ మెన్ బెంబేలెత్తక తప్పదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
- Tags
- క్రికెట్

