బీజేపీలో ఇక వీరికి కాలం చెల్లినట్లేనా?

బీజేపీ అంటేనే హిందుత్వ నినాదంతో ముందుకు వచ్చిన పార్టీ. దీన్ని ఎవరూ కాదనలేరు. ఆ పార్టీ సిద్దాంతాలు, సంఘ్ పరివార్ లో పనిచేసిన వారే ఎక్కువగా ఆ పార్టీలో కీలకపాత్ర పోషిస్తుంటారు. కాని రాను రాను ఆ పార్టీలో హిందుత్వ వాదులు ఇమడలేక పోతున్నారనేది జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే స్పష్టమవుతుంది. హిందుత్వ పోకడలతో పార్టీలోకి వచ్చిన వారు బీజేపీలో ఇమడలేకపోతున్నారు. అనేక మంది సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారు బీజేపీలో నాయకులుగా ఎదిగారు. వీరంతా మంచి పొజిషన్ కూడా వెళ్లారు. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. చాలా మంది నేతలు మనసు చంపుకోలేక పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
నరేంద్ర నుంచి ప్రారంభం....
గతంలోనే ఇలాంటి సంఘటనలే జరిగాయి. హిందుత్వ అజెండాతోనే ముందుకు వచ్చి పార్టీలో దమ్మున్న లీడర్ గా ఎదిగిన ఆలే నరేంద్ర చివరకు పార్టీని వదిలిపెట్టాల్సి వచ్చింది. నరేంద్ర డివిజన్ స్థాయి నేత నుంచి పార్లమెంటు స్థాయికి ఎదిగారు. అయితే ఆయనకు స్థానిక నేతలతో వచ్చిన తలనొప్పులకారణంగా పార్టీని వీడాల్సి వచ్చింది. బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. అయితే చివరకు ఆయన మళ్లీ కమలం పార్టీలో చేరారు. ఇక హైదరాబాద్ లో మాస్ లీడర్ గా ఎదిగిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హిందుత్వ ఎజెండాను చేతపట్టుకుని వచ్చిన వారే.
రాజాసింగ్ దీ అదే బాట....
2014 ఎన్నికలకు ముందే ఆయన బీజేపీలో చేరి టిక్కెట్ సంపాదించి ఎమ్మెల్యే అయ్యారు. కాని ఆయనకు రాష్ట్ర పార్టీ నేతలకు మధ్య పొసగడం లేదు. ఆయనను రాష్ట్ర పార్టీ నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో రాజాసింగ్ బహిరంగంగానే పార్టీ నాయకత్వంపై విమర్శలు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదేరకంగా ఉత్తర తెలంగాణలో ఎదిగిన నేత బండి సంజయ్. ఆయన కూడా హిందుత్వాన్ని భుజాన వేసుకుని నేతగా ఎదిగారు. కరీంనగర్ జిల్లాలో మాస్ నాయకుడిగా బండి సంజయ్ కుపేరుంది. గత ఎన్నికల్లో ఆయనకు రెండో స్థానం లభించింది. అయతే పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని అధినాయకత్వానికి వివరించినా పట్టించుకోలేదు. దీంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వందల మంది కార్యకర్తలతో పార్టీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. రాజకీయాలకు దూరంగా ఉంటానని బండి సంజయ్ ప్రకటించారు. ఇలా ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి నేతలు రాక, ఉన్న పార్టీ లో నుంచి నేతలు వెళ్లిపోవడం తెలంగాణ బీజేపీకి తీవ్ర నష్టం కలగచేస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని నేతలు మాత్రం పార్టీలో సర్దుకుపోతుండటం విశేషం.
- Tags
- బీజేపీ

