బీజేపీకి చెక్ పెట్టడానికే ఈ ఇద్దరూ...?

పాతబస్తీలో ఆకుపచ్చ, గులాబీ పార్టీలు కలిసి పోయాయి. ఈ బంధం మరింత బలపడింది. అధికార టీఆర్ఎస్, మిత్రపక్షమైన ఎంఐఎంలు రెండు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీజేపీని కట్టడి చేసేందుకే వ్యూహాత్మకంగా... బహిరంగంగా ఎంఐఎం అధికార టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతుందన్నది జగమెరిగిన సత్యం. ఇటీవల కాలంలో బీజేపీ పాతబస్తీపై కన్నేసింది. బూత్ కమిటీలను నియమించింది. అమిత్ షా కూడా వచ్చి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా సున్నీ ముస్లింలతో సమావేశం జరిపి ముస్లింలను విభజించే ప్రయత్నాన్ని అమిత్ షా చేశారన్నది ఎంఐఎం వాదన. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే బీజేపీకి అడ్డుకట్ట వేయాలని ఎంఐఎం భావిస్తోంది.
ఒకరినొకరు కీర్తించుకుంటూ....
అందుకోసమే అసెంబ్లీ సమావేశంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కీర్తిస్తున్నారు. కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని తెగ పొగిడేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లోనూ తాము కలిసే పోటీ చేస్తామని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే ఇది నెలలు గడుస్తున్నా సాధ్యం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉన్నందున దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లేవనెత్తిన ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అధికార పార్టీకి అండగా నిలిచారు. కేసీఆర్ లాగా ముస్లింలకు ఎవరూ చేయలేదని చెప్పారు. ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించడం ఎప్పుడూ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వంద కోట్లనే గతంలో కేటాయించిందన్నారు. రిజర్వేషన్ల విషయంలో్ కూడా అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదని ఎదురుదాడికి దిగారు. ఇదంతా బీజేపీని కట్టడి చేయడానికేనన్నది పరిశీలకుల భావన. ఇక కేసీఆర్ కూడా నిజాం రాజును కీర్తించారు. నిజాం చరిత్రను తాను తిరగ రాయిస్తానన్నారు. నిజాం చేసిన మంచిపనులు చెప్పకుండా వ్యతిరేక ప్రచారం ఎందుకు చేస్తున్నారన్నారు. మొత్తం మీద బీజేపీని దెబ్బకొట్టేందుకు ఆకుపచ్చ, గులాబీ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా మజ్లిస్ సహకారం అవసరమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీని కలుపుకుని పోతున్నారు.

