బీజేపీ వాయిస్ రైజ్ చేస్తుందే.....!

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. కొన్నింటిని విభజన చట్టంలో లేకపోయినా అమలుపర్చామని చెప్పారు. రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్, దుగరాజు పట్నం పోర్టు వంటి విషయాలు కేంద్ర పరిశీలనలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా రైల్వే జోన్ ఏర్పాటుపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయని చెప్పారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారితో కేంద్రం ఇప్పటికే చర్చలు ప్రారంభించిందన్నారు. ఏపీకి ఎన్నడూ లేని విధంగా కేంద్రం అన్నిరకాలుగా సాయం చేస్తున్నప్పటికీ టీడీపీ బీజేపీపై విమర్శలు చేస్తుండటం బాధాకరమన్నారు.
ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని.....
కేంద్రం ఏపీకి చేసిన సాయం గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సమావేశం అభిప్రాయపడింది. రెవెన్యూ లోటులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీని కూడా జత చేస్తే కేంద్రం ఎందుకు ఇస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. బీజేపీపై టీడీపీ చేస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించారు. దుగరాజుపట్నం, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ అంశాలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయో చంద్రబాబుకు తెలిసి కూడా విమర్శలు చేయడం దురదృష్ణకరమన్నారు. రైల్వే జోన్ విషయంలో కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేతలు తెలిపారు.
విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి.....
విభజన సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటు పై స్పష్టత లేదని తెలిపారు. తాము ఏపీ ప్రయోజనాలకోసం ఆనాడే పోరాటం చేసశామని గుర్తు చేశారు. టీడీపీ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని సమావేశం అభిప్రాయపడింది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని, మరోసారి అలాంటి తప్పు జరగకుండా ఉండాలన్నదే బీజేపీ అభిప్రాయపడింది. వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయకపోవడం ఏంటని కొందరు బీజేపీ నేతలు ఈ సమావేశంలో ప్రశ్నించారు. ఆ ప్రాంతాల్లో పరిశ్రమలకు కేంద్రం రాయితీలు ప్రకటించినా రాష్ట్రం ఉపయోగించుకోలేదన్నారు. మొత్తం మీద టీడీపీ కేంద్రంపై పోరాట బాట పడుతున్న సమయంలో బీజేపీ మాత్రం తాము అంతా చేసేశామని, రాష్ట్ర ప్రభుత్వమే అనవసర రాద్ధాంతం చేస్తుందని అభిప్రాయపడటం విశేషం. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీడీపీని వెనకేసుకొచ్చిన బీజేపీ అధ్యక్షుడు హరిబాబు సయితం వాయిస్ ను రైజ్ చేయడం గమనార్హం. ఈ సమావేశంలో హరిబాబు, పురంద్రీశ్వరి, సోము వీర్రాజు, మాధవ్, విష్ణుకుమార్ రాజు, గోకరాజు గంగరాజు తదితరులు హాజరయ్యారు.
- Tags
- బీజేపీ

