బీజేపీ అట్టర్ ఫ్లాప్ అయిందా?

తెలంగాణ బీజేపీకి అచ్చి వచ్చినట్లు లేదు. పార్టీని ఎవరూ నమ్మడం లేదా? కమలం పార్టీలోకి వెళ్లాలంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇదే అందరినోట విన్పిస్తున్న మాట. తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది బీజేపీయే. మూడు నెలల క్రితం అమిత్ షా తెలంగాణలో పర్యటించినప్పుడు రాష్ట్ర నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. ఏపార్టీ వారినైనా తీసుకు రమ్మని చెప్పారు. తిరిగి తాను వచ్చే సరికి పెద్దసంఖ్యలో పార్టీలో నేతలు చేరేలా చూడాలని ఉద్భోదించారు. అయితే అమిత్ షా వెళ్లిన తర్వాత రాష్ట్ర పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించ లేదనే చెప్పాలి. తెలంగాణలో బీజేపీని పటిష్ట పర్చేందుకు అమిత్ షా పెద్ద వ్యూహాన్నే రచించారు. బూత్ లెవెల్ కమిటీల దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకూ అన్నింటిపైనా ఆరా తీశారు. యూపీలో వాడిన ద్విచక్రవాహనాలను కూడా తెలంగాణకు రప్పించారు.
కమలం వైపు చూసే వారేరీ?
అమిత్ షా ఇంత చేసినా బీజేపీ రాష్ట్ర నేతలు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పక తప్పదు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు డీఎస్ కుమారుడు అరవింద్ తప్ప పెద్దగా ఆ పార్టీలో ఎవరూ ఇప్పటి వరకూ చేరలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తారన్నారు.. రేవంత్ వచ్చి చేరిపోతారన్నారు... ఇంకా కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి అనేక మంది నేతలు పార్టీలోకి చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని డప్పాలు కొట్టిన బీజేపీ నేతలు ఏకంగా ఒక జాబితాను కూడా రూపొందించి అధిష్టానానికి పంపారు. కాని ఆ జాబితాలో ఏ ఒక్కరూ చేరలేదు సరికదా... కమలం పార్టీ వైపు చూడటానికి కూడా సాహసించడం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత టీడీపీ నేతలు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ వైపే వెళ్లారు కాని బీజేపీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నిన్న మొన్నటి దాకా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ లో జోష్ పెరిగింది కాని కమలం పార్టీ మాత్రం మాటలకే పరిమితమయిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీనిపై జాతీయ పార్టీ నేతలు కూడా రాష్ట్ర పార్టీ నేతలపై ఆగ్రహంతో ఉన్నారట. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటేనని, కమలం పార్టీ రెండంకెల సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమేనని భావించడమేనంటున్నారు. ఆ పార్టీలో చేరితే టిక్కెట్ దక్కినా ఫలితం ఉండదన్న భావనతో కాషాయదళానికి దూరంగా ఉండటమే బెటర్ అని చాలామంది నేతలు డిసైడ్ అయ్యారట. మొత్తం మీద తెలంగాణలో అమిత్ షా వ్యూహం వర్క్ అవుట్ కాలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు అట్టర్ ఫ్లాప్ అయ్యారన్నది వాస్తవం.
- Tags
- బీజేపీ

