బీజేపీ అగ్రనేతలకు ఏపీపై క్లారిటీ వచ్చినట్లుందే...!

ఆంధ్రప్రదేవ్ బీజేపీని అధిష్టానం పట్టించుకోవడం లేదా? టీడీపీతో పొత్తుకు వెళదామన్న నిర్ణయంతో రాష్ట్ర బీజేపీని నిర్లక్ష్యం చేస్తుందా? అవుననే అంటున్నారు ఏపీకి చెందిన బీజేపీనేతలు. బీజేపీ ఏపీలో ఇప్పుడు నామమాత్రంగానే మిగిలిపోయింది. ఏపీలో తాము బలపడతాం... తమ బలమేంటో నిరూపిస్తాం అని ఇప్పటి వరకూ చెప్పుకొచ్చిన నేతలు క్షేత్రస్థాయిలో ఆ ప్రయత్నాలేవీ చేయడం లేదు. ఆరు నెలల క్రితం అమిత్ షా పర్యటన తర్వాత ప్రజల్లోకి వెళ్లిందీ లేదు. బహిరంగ సభలను ఏర్పాటు చేసిందీ లేదు. మాజీ కేంద్రమంత్రి పురంద్రీశ్వరి తప్ప ఎవరూ రాష్ట్రంలో పర్యటించడం లేదు. దీనిని పెద్దగా అధిష్టానం కూడా పట్టించుకోవడం లేదు. ఎటూ టీడీపీతో పొత్తు ఉంటుంది కాబట్టి తమకు కేటాయించే సీట్లలో బలం పెంచుకుందామన్న భావనలోనే పార్టీ హైకమాండ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి గడపకూ వెళ్లి బీజేపీ స్టికర్లు అంటించాలన్న కార్యక్రమాన్ని కూడా నేతలు అటకెక్కించేశారు.
కార్యక్రమాలకు దూరంగా....
ఇక బీజేపీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉన్నారా? లేదా? అన్నదీ డౌటే. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఆయన విశాఖ పార్లమెంటు సభ్యుడు కూడా. ఆయన ఎక్కువగా ఢిల్లీ లేకుంటే విశాఖలోనే గడుపుతుంటారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయానికి వచ్చేది కూడా తక్కువే. గతంలో కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు తరచూ ఏపీలో పర్యటించేవారు విశాఖ, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి ఇలా ఆయన పర్యటనలు ఎక్కువగా సాగేవి. దీంతో వెంకయ్య సభలకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లుచేసేవారు. కాని వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత ఆయన పెద్దగా పర్యటించడం లేదు. ఒకవేళ వచ్చినా ఆయనవి అధికారిక కార్యక్రమాలే. దీంతో ఇప్పుడు ఏపీ బీజేపీని పట్టించుకునే వారే కరువయ్యారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మినహా ఎక్కడా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు గత ఆరు నెలల నుంచి లేకపోవడం విశేషం. ఇక బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారని ఎన్నో ఊహాగానాలు విన్పించాయి. అది కూడా జరగలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు, కన్నాలక్ష్మీనారాయణల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కాని ఇప్పటివరకూ అతీగతీ లేదు. దీంతో బీజేపీ కేంద్ర పార్టీ కూడా ఇక్కడి బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదనే అర్థమవుతోంది.
- Tags
- బీజేపీ

