బిజెపిని ఇరికించే పనిలో టిడిపి ....?

గత ఎన్నికల్లో బిజెపి టిడిపి కలిసి పోటీ చేశాయి. వీరికి జనసేన మద్దతు ప్రకటించింది. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ హామీ ఇచ్చినా మ్యానిఫెస్టో లో పెట్టినా నైతికంగా మిగిలిన పార్టీలు వాటికి బద్ధులై వున్నట్లే. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తెలుగుదేశం కమలనాధులను కార్నర్ చేసేందుకు సిద్ధమైంది. ఏపీ లో కాపులకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఐదు శాతం ప్రకటించిన రిజర్వేషన్ల అంశం పై కేంద్రం మోకాలడ్డే పరిస్థితి తేటతెల్లం అయ్యింది. ఈ నేపథ్యంలో సరికొత్త గేమ్ స్టార్ట్ చేశారు టిడిపి నేతలు.
మా హామీకి మీకు బాధ్యత వుంది అంటూ ...
గత ఎన్నికల్లో టిడిపి ఇచ్చిన హామీల అమల్లో బిజెపి కి బాధ్యత వుంది. ఇరు పార్టీలు ఒకే వేదికపై నుంచి ప్రజలకు హామీ ఇచ్చాయి. ఇప్పుడు కేంద్రంలో బిజెపి సర్కార్ తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తే కుదరదు అంటున్నారు టిడిపి వారు. తనకు అవసరమైనప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా బిజెపి వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు. ఓబిసి రిజర్వేషన్ల ప్రక్రియ పై రోహిణి కమిషన్ ను కేంద్రం ఎందుకు నియమించిందని అదే తాము మంజునాథ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తే తప్పేలా అవుతుందన్న వాదన మొదలెట్టేశారు. రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ లో చేర్చడం కేంద్రం బాధ్యత అని ఇప్పుడు 50 శాతం దాటితే పరిశీలనకు సైతం తీసుకోమంటూ సాక్షాత్తు ప్రధాని ప్రకటించడాన్ని ఆ పార్టీ వారు తప్పు పడుతున్నారు.మరి టిడిపి తాజా ప్రచారాన్ని కమలనాధులు ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి.
- Tags
- బీజేపీ టీడీపీ

