బిజెపి గూబ గుయ్యిమందే ...?

పంజాబ్ లోని గురుదాస్ పూర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితం బిజెపికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక్కడ నాలుగు సార్లు విజయ కేతనం ఎగురవేసిన వినోద్ ఖన్నా మరణంతో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి కోటను బద్దలు కొట్టేసింది. గురుదాస్ పూర్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి స్వరణ్ సలారియా ఒక లక్షా 93 వేల 219 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జక్కర్ పై తుక్కు కింద ఓడిపోయారు. 40 ఏళ్ళ గురుదాస్ పూర్ ఎన్నికల చరిత్రలో ఇదే అక్కడ అత్యధిక మెజారిటీ కావడం విశేషం. అందులోను ఇక్కడ 9 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఒకే ఒక్క అసెంబ్లీ సీట్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అదీ కాక ఉపఎన్నికల్లో బిజెపి , ఆప్ లు సొమ్ములు వెదజల్లి ప్రచారం ధూమ్ ధామ్ చేసినా ఫలితం లేకుండా పోయింది.
గుజరాత్ , హిమాచల్ ఎన్నికల ముందు ఇలా .....
దేశంలో కీలకమైన గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ముందు ఇలాంటి ఫలితాలు ఎదురుకావడం, పడుకుంది అని భావించిన కాంగ్రెస్ మమ్మి రిటర్న్స్ లా తెరమీదకు రావడం కమలనాధులను కలవరపెడుతుంది. గురుదాస్ పూర్ లో అత్యధిక హిందూ ఓటు బ్యాంక్ వుంది. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన ఇక్కడే సర్జికల్ స్ట్రైక్స్ కూడా జరిగాయి. అలాంటి ఎంతో పట్టు వున్న ప్రాంతంలో ఈ పరాజయాన్ని కాషాయదళం జీర్ణించుకోలేక పోతుంది. ఈ ఎన్నికపై పోస్టుమార్టం మొదలెట్టింది బిజెపి.
బిజెపి పతనం ఆరంభం అయిందంటున్న సిద్ధూ ...
బిజెపి నుంచి కాంగ్రెస్ కి గత అసెంబ్లీ ఎన్నికలముందు జంప్ అయిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తాజా ఫలితంపై సంబరాలు మొదలెట్టారు. దీపావళికి ముందు రాహుల్ కి బహుమతి ఈ గెలుపు అంటూ వ్యాఖ్యానించారు సిద్ధూ. అలాగే దేశంలో బిజెపి ప్రాభవానికి కాలం చెల్లిందన్నారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ బిజెపి అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని జీఎస్టీ , నోట్ల రద్దు ప్రభావమే ఈ ఫలితం అనడం విశేషం. మొత్తానికి వరుసగా ఇటీవల తగులుతున్న ఎదురు దెబ్బలు కమలనాధులను ఆలోచనలో పడేస్తున్నాయి.
- Tags
- బీజేపీ

