బామ్మర్ది పెద్ద చిక్కు తెచ్చి పెట్టాడే...!

బామ్మర్ది కొత్త చిక్కు తెచ్చిపెట్టాడే. చంద్రబాబుకు బాలయ్య బాబు పెద్ద తలనొప్పే తెచ్చి పెట్టాడు. నంది అవార్డుల వివాదం ముదురుతోంది. అన్నీ నందమూరి ఫ్యామిలీకే అవార్డులు దక్కడంతో మిగిలిన హీరోలు, డైరెక్టర్లు అసంతృప్తి చెందుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ బాలయ్య బాబు రేపిన వివాదంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏపీలో సినిమా పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ప్రతి హీరోకూ వీరాభిమానులు ఎక్కువే. అయితే ఎప్పుడూ లేనంత వివాదం ఈసారి నంది అవార్డుల్లో చోటుచేసుకుంది. కేవలం ఒక కుటుంబానికి, ఒక సామాజిక వర్గానికే అవార్డులు పరిమితమయి పోయాయని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. ఇందులో డైరెక్టర్ గుణశేఖర్, నిర్మాతలు బన్నీ వాసు, బండ్ల గణేష్ లు మీడియా ముందుకు వచ్చి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నంది అవార్డులు కావని, నందమూరి అవార్డులని సోషల్ మీడియాలో సెటైర్లు వేసేస్తున్నారు.
అవార్డుల్లో కులం గోల....
వచ్చే ఎన్నికల్లో కులాల సమీకరణ ఏపీలో ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు చంద్రబాబు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తుండటంతో చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. తాజాగా నంది అవార్డుల్లో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని అదే సామాజిక వర్గానికి చెందిన ప్రొడ్యూసర్లు బయటపడిపోయారు. దీంతో ఏపీలో ఉన్న మెగా హీరోల ఫ్యాన్స్ రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే హీరో ప్రభాస్ కు కూడా ఏపీలో ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. ప్రభాస్ కు కూడా నంది అవార్డుల్లో చోటు దక్కకపోవడంతో ఆయన ఫ్యాన్స్ కూడా నంది అవార్డుల ఎంపికను తప్పుపడుతున్నారు. నంది అవార్డుల ఎంపికలో బాలయ్య బాబు కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. జ్యూరీని బాలయ్య బాబు ప్రభావితం చేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బావమరిది బాలయ్య చంద్రబాబును పెద్ద చిక్కుల్లో పడేసినట్లయింది. దీన్నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాలి.

