బాబుపై రివేంజ్ కోసం వాళ్లు వెయిటింగా?

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న మొన్నటి వరకు భుజాలు భుజాలు రాసుకుని తిరిగిన జనసేన, టీడీపీలు ఇప్పుడు కత్తలు నూరుకుంటున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. విషయంలోకి వెళ్తే.. 2014లో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ అప్పట్లో ప్రచారం చేశారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య చెలిమి పెరుగుతూ వచ్చింది. అయితే, ప్రత్యేక హోదా విష యంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును పవన్ అప్పట్లోనే ఖండించారు.
పాచిపోయిన లడ్డూలతో....
ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. అయినప్పటికీ.. రెండు పార్టీలూ కలిసే పనిచేశాయి. ఇక, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైనా పవన్ అప్పుడప్పుడు ఫైట్ చేస్తున్నా.. ఇవి అంతగా రెండు పార్టీల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా మారలేదు. అయితే, అనూహ్యంగా ఇటీవల జనసేనాని గుంటూరులో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సదస్సులో చేసిన కామెంట్లు మాత్రం టీడీపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేశాయి. అవినీతిలో ఏపీలో నెంబర్-1గా మారిందని పవన్ చెప్పుకొచ్చారు.
తాను నిజాయితీకి మారుపేరంటూ...
అంతేకాదు, అవినీతి సామ్రాట్ శేఖర్‌రెడ్డి కేసులో చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ పేరు ఉందని, ఈ విషయం తెలిసే ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్నిసార్లు కోరినా చంద్రబాబుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆయన విమర్శలు చేశారు. మన బంగారం మంచిదైతే.. అంటూ తనదైన శైలిలో డైలాగులు పేల్చారు. ఈ పరిణామంతో ఈ రెండు పార్టీల మధ్య చీలిక ఏర్పడింది. పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందని చంద్రబాబు బహిరంగ విమర్శలకు దిగారు. అంతేకాదు, తాను నిజాయితీకి మారుపేరని కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పవన్ ఎన్ని మాటలు అన్నా పన్నెత్తు విమర్శ చేయని చంద్రబాబు తన చంద్రదండును రంగంలోకి దింపారు. పవన్‌పై విరుచుకుపడేలా తెరచాటున ఆదేశం జారీ చేశారు. దీనిని అందిపుచ్చుకున్న తెలుగు తమ్ముళ్లు గత రెండు రోజులుగా పవన్‌పై రెచ్చిపోతు న్నారు. పవన్ అమ్ముడు పోయాడని, బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నాడని వ్యాఖ్యలు సంధించారు.
సోషల్ మీడియాలో....
సోషల్ మీడియాలో పవన్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఓ ఆటాడుకుంటున్నారు. మరి ఇలా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతే.. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఊరుకుంటారా? వారు కూడా బాబు లక్ష్యంగా కామెంట్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే, పక్కా ఆధారాలతో వారు ప్రిపేర్ అవుతున్నట్టు సమాచారం. బాబు అభిమానుల మాదిరి తాము ఏది పడితే దాన్ని ప్రచారం చేయమని.. గురి చూసి కొడతామని చెబుతున్నారు. ఇలాంటి వేళ.. బాబు నోటి నుంచి నా రాష్ట్రానికి అన్యాయం చేయమని కేంద్రాన్ని కోరానంటూ చేసిన ప్రసంగం క్లిప్ ఇప్పుడు ఆయుధంగా మారింది. పవన్ మాటల్ని రకరకాలుగా వైరల్ చేసే వారికి బుద్ధి చెప్పేలా బాబు టంగ్ స్లిప్ క్లిప్ ను సోషల్ మీడియా వేదికగా చేసుకొని వైరల్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి.. దీనికి బాబు వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఏదేమైనా ఏపీలో టీడీపీ-జనసేన వర్గాలు పోరు తీవ్రం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
