బాబుకు పాలిటిక్స్ రుచి చూపించిన పార్టీలు

ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్రంలోని మిగిలిన పక్షాలు పాలిటిక్స్ అంటే ఏమిటో రుచి చూపించాయి. ఇప్పటి వరకు తనకు తిరుగులేదని, తనకు ఎదురు లేదని భావించిన చంద్రబాబుకు తొలిసారి తమ పవర్ ఏంటో ఆయా పార్టీలు తాజాగా చెప్పకనే చెప్పాయి. విషయంలోకి వెళ్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించకపోవడం వంటి కీలక సమస్యలపై నాలుగేళ్లు కేంద్రంతో సర్దుపోయారు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంతలా సర్దుకుపోయి.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో సర్దుకు పోయిన ఫలితంగా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించాల్సి వచ్చిందనే అపవాదును ఎదుర్కొన్నారు. దీనికితోడు ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్ అలానే ఉంది. దీంతో చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చుకుని కేంద్రంపై పోరుకు సిద్ధమయ్యారు.
ఇతర పక్షాలను చేరదీసి....
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ.. చంద్రబాబు కేంద్రంతో ఉన్న బంధాన్ని కటీఫ్ చేసుకున్నారు. ఎన్డీ యే నుంచి బయటకు వచ్చారు. కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించారు. అయినా కూడా ఎక్కడా బాబు ప్లాన్ సక్సెస్ అవు తున్న పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయన ఇన్నేళ్లలో తొలిసారిగా అఖిల పక్ష సమావేశానికి తెరదీశారు. రాష్ట్రం లోని మిగిలిన పక్షాలను చేరదీసి.. పక్కా ప్లాన్‌తో కేంద్రంపై మరింత యుద్ధం చేసేందుకు బాబు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన అఖిల పక్షం పిలును ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు అఖిలపక్షం వేయాలని కాంగ్రెస్ సహా కమ్యూనిస్టులు డిమాండ్ చేశారు. అయితే, అప్పట్లో రాష్ట్రంలో తన పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదని, ఉండాల్సిన అవసరం కూడా లేదని బాబు ప్రకటించారు.
తన ఒక్కడి వల్లనే కాదని....
ఈ పంథాలోనే తన ఇష్టానుసారంగా వ్యవహరించారు. అయితే, పరిస్థితులు యూటర్న్ తీసుకున్నాయి. కేంద్రంతో తన ఒక్కడి పోరాటం సరిపోదని ఆయన గ్రహించారు. రాష్ట్రంలో తానొక్కడినే లేనని, మరో కొన్ని పార్టీలు కూడా ఉన్నాయని బాబు గుర్తించారు. ఈ క్రమంలోనే ‘అఖిల సంఘాల’ సమావేశం అంటూ ఓ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు, చివరకు ఉద్యమ సంఘాలకు కూడా బాబు పిలుపు నిచ్చారు. అయితే, అనూహ్యంగా ఈ విషయంలో బాబుకు షాక్ తగిలింది. ఆయన నిర్వహించే అఖిలపక్ష/సంఘాల సమావేశానికి సభలో ప్రాతినిధ్యం ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా హాజరుకాకూడదని నిర్ణయం తీసుకోవటంతో ఇంచుమించు చంద్రబాబుకు శరాఘాతంగా పరిణమించింది.
వైసీపీ, టీడీపీ కూడా....
ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అయితే అసలు చంద్రబాబును నమ్మి ఈ సమావేశానికి రావాలా? అని ప్రశ్నించింది. ఆ ఉద్య మం ఏదో తాము సొంతంగా చేసుకుంటున్నామని తాము హాజరుకాబోమని తేల్చిచెప్పేసింది. నిన్న మొన్నటివరకూ చెట్టపట్టాలేసుకుని తిరిగిన బీజేపీ కూడా పక్కదారి పట్టింది. ఇక, చంద్రబాబు ఫ్రెండ్‌గా భావించే పవన్ కూడా ఈ సమావేశాన్ని తోసిపుచ్చారు. నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు బాబు ఇలా వ్యవహరించడం ఏంటని ఆయనకు రాజీ పడిపోవడం తప్ప ఏమీ తెలియదని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల ఆగ్రహం వ్యక్తం అయ్యాక..మీ పాపం తలా పిడికెడు పూసేందుకు ఇఫ్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ పని మూడేళ్ల కిందట చేయాల్సింది అని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇప్పుడు బాబు పరిస్థితి శకునం చెప్పే బల్లి సామెతను తలపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
