బాబు లీకు వీరుడయ్యారెందుకు?

ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లు, మీడియాకు లీకుల ద్వారానే కేంద్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో ఏ అంశమైనా...అది చిన్నదైనా... పెద్దదైనా చంద్రబాబు మీడియా ముందుకు వచ్చేవారు. చివరకు సూర్యనమస్కారాలు చేయాలని కూడా మీడియా ముందుకు వచ్చి విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు గత కొద్ది రోజులుగా మీడియా ఎదుటకే రావడం లేదు. సీఎంవోచెప్పిన విషయాలనే మీడియా బయటకు తెస్తోంది. అంటే సీఎంవో లీకులిస్తుందన్నమాట.
కేంద్రం, రాష్ట్ర మధ్య మాటల యుద్ధం....
గత పది రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లు సీన్ క్రియేట్ అయింది. ఏపీకి ఏమీ చేయలేదని టీడీపీ, అంతా చేశామంటూబీజేపీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా టీడీపీ ఎంపీలు సభలోపల, బయట పెద్దయెత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు మాత్రం కేవలం టెలికాన్ఫరెన్స్ ల ద్వారానే ఎంపీలకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అది బయటకు లీకు చేస్తున్నారు. తాజాగా ఈరోజు కూడా చంద్రబాబు ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
టెలికాన్ఫరెన్స్ లోనే దిశానిర్దేశం...
వచ్చే నెల5వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. స్వాతంత్ర్యం కోసం ఉద్యమించడం గత చరిత్ర అని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమించడం ప్రస్తుత చరిత్ర అని చంద్రబాబు చెప్పారట. రాష్ట్ర ప్రయోజనాలకు మించి మరేదీ లేదన్నారు. ఏపీని విస్మరించడమంటే ఏపీ ప్రజలను విస్మరించడమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. లేఖలతో వైసీపీ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగులుతోందన్నారు. హామీల అమలుకోసం పోరాడుతున్న కేంద్రమంత్రిపై వైసీపీ ఫిర్యాదు చేయడం శోచనీయమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలపై పోరాడాల్సిందేనన్నారు.
ఈ లీకుల్లో నిజమెంత?
అయితే అంతా బాగుంది కాని... చంద్రబాబు తన అభిప్రాయాన్ని నేరుగా ప్రజలకు ఎందుకు తెలయజేయడం లేదన్నదే ఇప్పుడు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఎప్పుడూ మీడియా సమావేశం పెట్టే చంద్రబాబు గత పది రోజుల నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దావోస్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టడం లేదు. అయితే నేరుగా మోడీ ప్రభుత్వం పై విమర్శలు చేయలేక, ఎంపీలు, టీడీపీ నేతలతోనే ఆయన చేయిస్తున్నారన్న టాక్ ఉంది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయని టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మరి ఆ కారణాలేంటో మాత్రం చెప్పడం లేదు మరి. అయితే చంద్రబాబు కార్యాలయం ఇచ్చే లీకుల్లో నిజమెంత? అన్నది తేలాల్సి ఉంది.
- Tags
- చంద్రబాబు

