బాబు పాలనపై టీడీపీ ఎమ్మెల్సీ రెచ్చిపోయారే..!

స్వపక్షంలో విపక్షం అంటే.. ఏమిటో చూపించేశారు టీడీపీ ఎమ్మెల్సీ మూర్తి. వస్తుందొస్తుంటారేకానీ.. ఆ వచ్చే రోజేదో చెప్పరంటూ.. అన్న క్యాంటీన్లపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచి పోయినా అన్నక్యాంటీన్లు.. ప్రకటనలకే పరిమితం అయిపోయాయని విమర్శించారు. మంత్రుల శాఖల్లోకి నేతలు మారినా వారి మాటలు మాత్రం మారలేదన్నారు. గతంలో పౌరసరఫరాల మంత్రిగా ఉన్న సునీత.. చెప్పిన మాటలే ప్రస్తుతం ఆ శాఖను చూస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారని, తేడా కొంచెం కూడా లేదని, చదివిన పాఠం అప్పగించినట్టు చెప్పుకొస్తున్నారని అన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణంలో అన్న క్యాంటీన్లపై ఇలాంటి ప్రకటనలు సమంజసమేనా? అని ప్రశ్నించారు.
అన్న క్యాంటీన్ల జాడేదీ?
సోమవారం శాసన మండలిలో అన్నక్యాంటీన్లు.. ఇతర ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మూర్తి.. ప్రభుత్వం తమదేనన్న ధ్యాస మరిచిపోయారో? లేక ప్రతిపక్షం పాత్ర కూడా మేమే పోషిస్తాం అన్న టీడీపీ అధినేత చంద్రబాబు మాటలను బాగా ఒంట బట్టించుకున్నారో? తెలియదు కానీ.. మొత్తానికి ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. తక్షణమే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక, రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు బాగాలేదన్నారు. డెంగ్యూ, మలేరియా విజృంభణతో ప్రజలు ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులబారి నుంచి ప్రజలను కాపాడాలని కోరారు.
ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా?
వాస్తవానికి మండలిలో విపక్షం అడిగే ప్రశ్నలకు, చేసే విమర్శలకు అధికార పక్షం సమాధానాలు చెప్పాల్సి ఉండగా .. తాజాగా వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏ ఒక్కరూ సభలకు హాజరు కావడం లేదు. దీంతో మూర్తికి మంచి సమయం చిక్కిందని టీడీపీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించడం గమనార్హం. ఫక్తు విపక్ష ఎమ్మెల్సీ మాదిరిగా మూర్తి రెచ్చిపోవడం అందరూ ఒకసారి ఆయనను ఎగాదిగా చూడడంతో మండలిలో ఒక్కసారిగా నిశ్వబ్ధ వాతావరణం కనిపించింది. ఏదేమైనా బాబు పాలనపై టీడీపీ ఎమ్మెల్సీనే ఇలా ఫైరై పోతే.. విపక్షం మాత్రం ఊరుకుంటుందా? అనే వ్యాఖ్యలూ వినిపించాయి.
- Tags
- టీడీపీ ఎమ్మెల్సీ

