బాబు నంద్యాల హామీ పవన్ ముందుకు...!

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు హామీ ఒకటి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వచ్చింది. ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు చంద్రబాబు నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. వారి విద్యాసంవత్సరం వృధా కాబోనివ్వనని, కేంద్రంతో మాట్లాడి అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి విద్యార్థులకు న్యాయం చేస్తానని చెప్పారు. ఈ చంద్రబాబు హామీని ఈరోజు ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు పవన్ కు ఆ క్లిప్పింగ్ ను తమ ఫోన్లో చూపించారు. దీనిని పవన్ కల్యాణ్ ఆసక్తిగా గమనించారు. దాదాపు వంద మంది విద్యార్థుల భవితవ్యాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని విద్యార్థులు పవన్ ఎదుట ఆరోపించారు. తమను రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. కళాశాల యాజమాన్యం తమను మోసం చేసిందని, వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనికి స్పందించిన పవన్ తాను విద్యార్థులకు న్యాయం చేసేందుకు పోరాడతానని హామీ ఇచ్చారు. ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఏపీ విద్యుత్తు కాంట్రాక్టు కార్మికులు కూడా పవన్ ను కలిసి తమ గోడునువెళ్లబోసుకున్నారు.

