పవన్ ఆఫీస్ పీకేశారు....!

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటారు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ప్రారంభించిన పార్టీ జనసేన ఆదిలోనే వివాదాలకు కేంద్ర బిందువు అయింది. ఇది ఎంతటి వివాదమంటే.. రాత్రిరాత్రి ఆఫీస్ పీకేసేంత వివాదం వరకు విషయం వెళ్లింది. దీంతో ఏపీలో జనసేన అభిమానులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయారు. విషయంలోకి వెళ్తే.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్.. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాదిలో జరగనున్న వార్షిక ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు రెడీ అవుతున్నారు. ఇటు ఏపీ, అటు తెలంగాణల నుంచి కూడా పోటీ చేస్తానని, తనకు మద్దతు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే తన పరివారం పోటీకి దిగుతుందని పవన్ ఇటీవల చెప్పాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పవన్ అరంగేట్రం ఖాయమని తెలిసిపోయింది.
లీజుకు తీసుకున్న స్థలంలో...
దీంతో రాష్ట్రంలో పార్టీ ప్రధాన కార్యాలయ నిర్మాణంపై పవన్ దృష్టి పెట్టాడు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం భూమి ఇస్తానన్నా కూడా వద్దని మంగళగిరి దగ్గర పార్టీ అభిమాని నుంచి లీజుకు తీసుకున్న భూమిలోనే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. మంగళగిరి మండలం చినకాకానిలోని సర్వే నెంబర్ 181/182 పరిధిలోని 3 ఎకరాల స్థలం లీజుకి తీసుకున్నాడు. ఆ స్థలంలోనే ఇటీవల అట్టహాసంగా సభ నిర్వహించారు. అక్కడే కార్యాలయం నిర్మించేందుకు స్థల యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక, కార్యాలయం ప్రారంభించడమే తరువాయి అనేలా అడుగులు పడ్డాయి. ఈ సమయంలోనే కొన్నాళ్ల కిందట ముస్లిం వర్గాలు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి.
ఆ స్థలం వివాదాస్పదం కావడంతో...
ఈ స్థలం ముస్లిం వర్గాలకు చెందినదని, పవన్ నిజానిజాలు తెలుసుకోకుండా పార్టీ కార్యాలయం కట్టడమేంటని అప్పట్లోనే ముస్లింలు రోడ్డెక్కారు. ముస్లిం నేత జక్రియాకు చెందిన ఈ స్థలంపై దివంగత యార్లగడ్డ సుబ్బారావుతో జరిగిన వివాదంలో స్థానిక న్యాయస్థానాల్లో జిక్రియాకే అనుకూల తీర్పు వచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ.. యార్లగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో నడుస్తోంది. అయితే దివంగత సుబ్బారావు తనయుడు వెంకటేశ్వరరావుతో ఆ మొత్తం స్థలాన్ని జనసేన కార్యాలయం ఏర్పాటు కోసం పవన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వివాదానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జలీల్ ఇటు రాజకీయ అటు న్యాయ పోరాటానికి దిగారు. కొన్ని రోజులు వరుసగా సదరు స్థలంలో నిరసనలు కూడా నిర్వహించారు.
తాత్కాలిక నిర్మాణాన్ని తొలగించి....
పవన్ను పలుమార్లు ఈయన హెచ్చరించాడు కూడా. అయినా నిన్న మొన్నటి వరకు లెక్కచేయని పవన్.. మరి ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి సదరు ప్రాతంలో నిర్మాణానికి సిద్ధమైన కార్యాలయాన్ని రాత్రికి రాత్రి తరలించేయడం సర్వత్రా విస్మయానికి గురి చేసింది. జనసేన స్థానిక నేతలు తాత్కాలికంగా నిర్మితమైన రేకుల షెడ్లు - ఐరన్ రాడ్లన్నింటినీ పలు వాహనాల్లో అక్కడ నుంచి తరలించారు. ఈ పరిణామంతో జనసేన కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. వాస్తవానికి దీనినే రాష్ట్ర పార్టీ కార్యాలయంగా పవన్ ప్రకటించడమేకాదు, దీనిని రాజకీయ, మేధో గ్రంధాలయంగా కూడా తీర్చి దిద్దుతానని చేసిన ప్రకటన ఫలించకపోడంతో అభిమానులు ఉసూరు మంటున్నారు. ఏదేమైనా జనసేన కార్యాలయానికి ఆదిలోనే హంసపాదు తప్పలేదు.

