ప్రొఫెసర్ గారి సత్తా కాసేపట్లో తేలిపోతుందా?

తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్, మేధావుల ఫోరం చైర్మన్ కోదండరామ్.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన పార్టీ టీఆర్ ఎస్పై చేస్తున్న పోరు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇరు పక్షాలు గతంలో ఎలా అయితే భుజా భుజాలు రాసుకుని ఉద్యమంలో పాలుపంచుకున్నాయో.. ఇప్పుడు అంతకన్నా ఘోరంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని మొదలు పెట్టిన కోదండ రామ్ అవినీతిపై పోరు అంటు ఉద్యమాలకు తెరదీశారు. ఇక, మిషన్ భగీరథ, నిసరనల అడ్డా.. ఇందిరాపార్కును తరలించడం వంటి విషయాల్లో ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగానే వ్యతిరేకించారు. అధికారులు ఎక్కడా పనిచేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల సభలకు కూడా కోదండరామ్ వెళ్లి పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు కూడా కుమ్మేశారు.
పోరు పంథా ఆగదంటున్న....
అయితే, ఆదిలో ఈ వివాదాలను కొంత సహించిన అధికార పక్షం.. ఆ తర్వాత ప్రొఫెసర్ అని కూడా చూడకుండా.. కోదండరామ్‌పై విరుచుకుపడ్డారు. ముందు కేటీఆర్‌తో ప్రారంభమైన ఈ యుద్ధం.. సీఎం కేసీఆర్ వద్దకు వచ్చేసరికి తీవ్రస్థాయికి చేరిపోయింది. కోదండరామ్‌ను ''వాడు.. వీడు..'' అంటూ కేసీఆర్ మీడియా ముందే అవమానకరంగా మాట్లాడారు. దీనిపైనా విమర్శలు వచ్చాయి. ఇక, కోదండరామ్ మాత్రం తన పోరు పంథా ఆగదని అప్పట్లోనే స్పష్టం చేశారు. పాలక పార్టీకి వ్యతిరేకంగా కలిసివచ్చే అన్ని పార్టీలనూ ఆయన ఏకం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన విద్యార్థి సంఘాలను ఏకం చేసి.. కేసీఆర్‌పై ఉసిగొల్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. కొలువుల కొట్లాట పేరుతో కోదండరామ్ సోమవారం నిర్వహిస్తున భారీ బహిరంగ సభ ఆయనలో కేసీఆర్‌ను ఢీ కొనే సత్తా ఏ పాటిదో స్పష్టం చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.
ఉదమ్యంలో ఏం జరిగిందన్న దానిపై...
వాస్తవానికి ఎప్పటినుంచో దీనిని నిర్వహించాలని ప్లాన్ ఉన్నా.. ఇది వాయిదా పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం దీనిని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తోందనే టాక్ కూడా నడిచింది. అయితే, సభకు కోర్టు ద్వారా అనుమతి సంపాదించుకుని జేఏసీ సభకు ఏర్పాట్లు చేసుకుంది. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం సభా కార్యక్రమాలను ప్రారంభించి, సాయంత్రం 6 వరకు నిర్వహిస్తామని జేఏసీ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగిన సంఘటనలు, ఉద్యమ ఘట్టాలు, జేఏసీ నిర్వహించిన పాత్ర వంటివాటిని గుర్తు చేసేలా పాట లను రూపొందించారు. నిరుద్యోగుల సమస్యలు, పరిష్కార మార్గాలపైనా పాటలు, నృత్య రూపకాలు ఉంటాయని జేఏసీ నేతలు వెల్లడించారు.
వివిధ పార్టీల నేతలతో....
తెలంగాణ ఉద్యమ సమయం లో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడామని, రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని జేఏసీ పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈ సభ ద్వారా కేసీఆర్‌పై కోదండరామ్ యుద్ధ భేరీ మోగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే ఈ సభకు హాజరుకావాలంటూ వివిధ పార్టీల నేతలను కోదండరాం ఆహ్వానించారు. టీపీసీసీ తరఫున మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, బీజేపీ ప్రతినిధిగా ఆ పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతోపాటు వివిధ పార్టీల ప్రతినిధులు హాజరవుతున్నారు. వివిధ ప్రజాసంఘాల నేతలు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు, మేధావులు, ప్రొఫెసర్లు హాజరవుతున్నారు. మొత్తాంగా ఈ సభ సక్సెస్ అయితే, కోదండరామ్ సక్సెస్ మాట అటుంచి కేసీఆర్‌కి మాత్రం ఎర్త్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

