ప్రాజెక్ట్ ల క్రెడిట్ కోసం ఈ ఇద్దరూ....?

ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీలు గతంలో జరిగిన పనులకు ప్రస్తుతం జరుగుతున్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల క్రెడిట్ తమదంటే తమదని కొట్లాట మొదలు పెట్టాయి. ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్ కోసం టిడిపి, తెలంగాణ లో మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం టిఆర్ఎస్ లు అదే పనిలో బిజీగా వున్నాయి. ఇక విపక్షాలు చూస్తూ ఎందుకు ఊరుకుంటాయి. ఏపీలో వైసిపి పోలవరం లో అవినీతి అక్రమాలు అంటూ గగ్గోలు పెడుతూ ఆ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ అనే అంశాన్ని తెరమీదకు తెచ్చే ప్రయత్నంలో వుంది. ఇక తెలంగాణాలో మెట్రో రైలు ప్రాజెక్ట్ తమ కష్ట ఫలితమే అంటూ కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జనం ఆశీస్సులు తమకే కావాలనే ప్రయత్నాల్లో వుంది.
ప్రజల సొమ్ముతో పార్టీల ప్రచారం ...
ఈ క్రెడిట్ ల కోసం తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాలు కోట్లాది రూపాయల సొమ్మును ప్రచారం కోసం మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. ప్రజాధనం దుర్వినియోగంలో ఏ పార్టీ వెనక్కు తగ్గడం లేదు. భారీ హోర్డింగ్స్ , పత్రికలు ఛానెల్స్ లో ప్రచారం కోసం జనం సొమ్ము వాడేస్తున్నాయి. ఏ ప్రభుత్వం అధికారం లో వున్నా ప్రజల సమస్యలు తీర్చడానికి వారు కట్టే పన్నులు ద్వారా సమకూరే ప్రజాధనానికి జవాబుదారీగా ఉండాలి. ప్రస్తుతం ఆ సీన్ ఇరు రాష్ట్రాల్లో ఆశించాలిసిన పని లేదు. తమ ప్రభుత్వ హయాంలోనే అవి జరిగినట్లుగా అధికార పార్టీలు డప్పులు కొట్టుకోవడం కొత్త ఏమి కాకపోయినా ఇది మరీ శృతి మించిపోతుంది. వాస్తవానికి ప్రజల కోసం అభివృద్హి కార్యక్రమాల ప్రక్రియ అన్నది నిరంతర కార్యక్రమం దానికోసం డప్పులు కొట్టినా కొట్టకపోయినా ఎవరి సమయంలో ఏమి జరిగాయన్నది ప్రజలు గమనిస్తూనే వుంటారు. కానీ అధికారపక్షాలు మితిమీరిన ఉత్సహంతో గత ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టబడి తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడుతుంటే హద్దులు మీరు మరి ప్రచారం కోసం ఎగబడి జనం సొమ్ము వృధా చేయడాన్ని అంతా తప్పు పడుతున్నారు. కానీ రాబోయేది ఎన్నికల సీజన్ కావడంతో అధికారాపేక్షలు ఎవరు మాత్రం ఈ మాట వింటారు.

