ప్రశాంత్ కిషోర్ సలహాలన్నీ తీసుకోనన్న జగన్

‘నేను మాట మీద నిలబడతా. విలువలకు పెద్దపీట వేస్తా. మహాభారతం, రామాయణంలోనూ చివరకు ధర్మమే గెలిచింది. చంద్రబాబు లాగా నాకు కుట్రలు తెలియవు.’ వైసీపీ అధినేత జగన్ తన మనసులో మాట ఇది. జగన్ ప్రజా సంకల్ప యాత్ర నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఒక తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పై విధంగా స్పందించారు. తన పార్టీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటుందని, అయితే తాను దానికి ఏమాత్రం బాధపడటం లేదన్నారు. తాను వారిని నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఎందుకంటే వారికి ఇవ్వాల్సినంత డబ్బు తన వద్ద లేదన్నారు. అయితే నేతలు వెళ్లినా అక్కడ లీడర్లను ప్రజలే తయారు చేసుకుంటారన్నారు. రాజకీయాల్లో విలువలు ఉండాలన్నారు. 25 నుంచి 30 కోట్లు ఇచ్చి తీసుకెళ్లారని ఆ నియోజకవర్గంలో ప్రతి పిల్లవాడికీ తెలుసున్నారు జగన్. అయితే తాను శిల్పా చక్రపాణి రెడ్డిపార్టీలో చేరేందుకు వచ్చినప్పుడు ఆయనకు స్పష్టంగా చెప్పానని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలని కోరానన్నారు. అందుకు ఆయన ఆ విధంగానే వ్యవహరించడం జరిగిందని, వైసీపీ ఎలాంటి విలువలు పాటిస్తుందో దీన్ని బట్టే అర్థమవుతుందన్నారు. గిడ్డి ఈశ్వరినే తీసుకుంటే ఆమె టీచర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారని, ఆమెను ప్రజలు ఆదరించారని, నాలుగేళ్లు ఆమెకు ప్రాధాన్యత ఇచ్చానని, ఇప్పుడు ఆమె తన పక్కన లేకుండా వెళ్లారని జగన్ ఆవేదన చెందారు.
నా దగ్గర డబ్బులేదు.. విలువ ఉంది’
తనపై కేసులు ఉన్నాయని, అవినీతి ఆరోపణలున్నాయని టీడీపీ బద్నామ్ చేస్తుందని, ఈ కేసులు రావడానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కారణం కాదా? అని ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం వల్లనే టీడీపీ గెలిచిందన్నారు. టీడీపీకి ఓట్లేయకపోతే రేషన్, పింఛన్లు కట్ చేస్తామని బెదిరించారన్నారు. ఉప ఎన్నికల్లో సహజంగానే అధికారపార్టీకి అడ్వాంటేజీ ఉంటుందన్నారు. అయినా కూడా చంద్రబాబు ఉప ఎన్నికలకు పోవడానికి భయపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. ప్రశాంత్ కిషోర్ టీం పార్టీకి బాగా ఉపయోగపడుతుందన్నారు. వారు పార్టీ బలోపేతానికి మంచి సూచనలు అందిస్తున్నారని చెప్పారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఇచ్చే సలహాలన్నింటినీ తాను తీసుకుంటానని కూడా చెప్పలేనన్నారు. పార్టీకి ఉపయోగ పడే సూచనలనే తాను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. జనంలో ఆదరణ ఉన్న నేతలకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్రలో తనకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుందన్నారు. వారిని చూస్తుంటే తాను నడుస్తున్నట్లే కన్పించడం లేదన్నారు. అలాగే తాను ప్రత్యేకమైన షూను పాదయాత్రలో వాడుతున్నానన్న మాట కూడా అవాస్తవమన్నారు. తాను వేసుకునే షూ ఏ బజార్లోనైనా దొరుకుతుందన్నారు.
- Tags
- ప్రశాంత్ కిషోర్

