ప్రథమ పౌరుడి విమానానికి ప్రయాణంలో లోపమా?

దేశమంతా ఇవాళ జయలలితకు నివాళి అర్పించే ఉధృతిలోనే ఉన్నది. కన్నుమూసిన విప్లవనాయకికి శ్రద్ధాంజలి ఘటించడంలో నేతలంతా నిమగ్నమై ఉన్నారు. జనం దృష్టి , మీడియా దృష్టి మరో అంశం మీద పడడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి కీలక సమయంలో.. మరో అంశం కాస్త ఆందోళనకరంగా కనిపిస్తోంది. అదే మన దేశ ప్రథమపౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సాంకేతిక లోపం కారణంగా వెనుతిరగాల్సి రావడం. ఇందువలన, ఆయన స్వయంగా జయలలిత భౌతిక కాయానికి నివాళి అర్పించకలేకపోవడం ఇక్కడ ప్రధానం కాదు.. ప్రథమపౌరుడైన రాష్ట్రపతి ప్రయాణిస్తున్న విమానాన్ని కూడా సరైన తనిఖీలు లేకుండా, ప్రయాణంలో గాల్లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తే పరిస్థితిలో ఎలా అనుమతించారన్నది ఆలోచించాల్సిన అంశం.
చెన్నైలో జయలలితకు నివాళి అర్పించడానికి ఢిల్లీనుంచి రాష్ట్రపతి, ప్రధాని వేర్వేరుగానే బయల్దేరారు. రాష్ట్రపతి ప్రత్యేకంగా వైమానిక దళానికి చెందిన విమానంలో బయల్దేరారు. కొంతదూరం వచ్చాక అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో తిరిగి వెనక్కు మళ్లించారు.
చూడడానికి ఇది చిన్న అంశంగానే కనిపించవచ్చు గానీ.. సాక్షాత్తూ రాష్ట్రపతి అంతటి ప్రముఖుడు ప్రయాణించే విమానానికి అన్ని రకాల తనిఖీలు ముందస్తుగా చేసుకుని ప్రయాణానికి అనుమతించాలన్న జాగ్రత్తల్లో అలసత్వం ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత.. కారణాలను అన్వేషించడం కాదని, అసలు ఇంత తీవ్రమైన పొరబాటు ఎలా జరిగిందో కూడా విచారణ సాగాలని పలువురు కోరుతున్నారు.
రాష్ట్రపతి బయల్దేరి ఒక కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహించినప్పుడు అక్కడకు హెలికాప్టర్ ద్వారా వెళ్లే ప్రయత్నం చేసిన ప్రణబ్ ముఖర్జీ , తీరా సమీపానికి వెళ్లాక యాగమండపం సమీపంలో అగ్నిప్రమాదం జరగడంతో.. హెలికాప్టర్ లాండ్ అవకుండానే వెనుదిరిగారు. అలాగే జయలలితకు తుదివీడ్కోలు పలకడానికి బయల్దేరిన తర్వాత.. వైమానిక దళాల వారి విమానంలో లోపం మూలంగా చెన్నయ్ చేరుకోలేక వెనుదిరిగారు. ఆ తర్వాత మరో ప్రత్యేక విమానంలో మళ్లీ చెన్నై వచ్చి జయలలితకు నివాళి అర్పించారు.

