ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే: గవర్నర్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ అన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాల్సిందేనని గవర్నర్ నరసింహన్ అన్నారు. విభజన సమస్యలను పరిష్కరించడంతో పాటుగా రెవెన్యూ లోటును కూడా భర్తీ చేయాలన్నారు. హామీల అమలుకోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
విభజనతో ఇబ్బందులు.....
ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన ఏపీని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలన్నారు. విభజన తర్వాత ఏపీ క్రమంగా కోలుకుంటుందన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని ముందుకు వెళుతున్నామని చెప్పారు. రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయంతో మరిన్ని సమస్యలు పెరిగాయన్నారు. 58 శాతం ఉన్న జనాభాకు 46 శాతం ఆదాయం ఇవ్వడం అన్యాయమని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
పంపిణీ హేతుబద్ధంగా జరగలేదు...
ప్రత్యేక హోదా, రైల్వే జోన్, దుగరాజు పట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ వంటి హామీలను నెరవేర్చాలన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడటంతో ఆదాయాన్ని కోల్పావాల్సి వచ్చిందన్నారు. ఆదాయం, ఆస్తుల పంపిణీలో హేతుబద్ధత లేదన్నారు. ఆస్తులను ప్రాంతాల వారీగా, అప్పులను జనాభా ప్రాతిపాదికన పంచడం అన్యాయమన్నారు. విభజన చట్టంలోని హామీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాలతో ఏపీ సమానం అయ్యే వరకూ సాయం చేయాలని కోరారు. చట్టంలో పొందుపర్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు.
- Tags
- గవర్నర్

