ప్రత్తిపాటి హ్యాట్రిక్ కు జగన్ బ్రేక్ వేస్తారా?

మంత్రి ప్రత్తిపాటి నియోజకవర్గమైన చిలకలూరిపేటలోకి వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రవేశించనుంది. చిలకలూరి పేట నియోజకవర్గం తెలుగుదేశానికి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ పై దాదాపు తొమ్మిది వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ప్రత్తిపాటి పుల్లారావు ప్రస్తుతం ఏపీ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఎదుర్కొనడం అంత సులువు కాదు. చిలకలూరి పేట నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండటంతో అనేక దఫాలుగా ఇక్కడ టీడీపీయే విజయం సాధిస్తూ వస్తోంది.
నాడు కాంగ్రెస్...తర్వాత టీడీపీ...
చిలకలూరి పేట నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఇప్పటికి 11 సార్లు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు విజయం సాధించింది. ఈ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కు పట్టుండేది. 1972, 1978, 1985, 1994లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులకు కూడా గెలుపు అవకాశాలున్నాయి. 1967, 1983, 2004లో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కక పోవడంతో మర్రి రాజశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం మర్రి రాజశేఖర్ వైసీపీలో కొనసాగుతున్నారు. ఇక్కడ ప్రత్తిపాటి పుల్లారావు 2009, 2014 ఎన్నికల్లో గెలిచి వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
పాదయాత్రతో బలం పెరిగి....
అయితే ప్రత్తిపాటి పుల్లారావు హ్యాట్రిక్ విజయానికి జగన్ బ్రేకులు వేస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. జగన్ పాదయాత్రతో చిలకలూరి పేట నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబసభ్యులపై వచ్చిన ఆరోపణలు కూడా తమకు కలసి వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. చిలకలూరి పేట నియోజకవర్గంలో గతంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వైసీపీకి తరలిపోయింది. క్యాడర్ ను కాపాడుకుంటూ, ఓటు బ్యాంకును పటిష్టపర్చే దిశగా జగన్ పాదయాత్ర సాగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకోసం పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్....
జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 117వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం జగన్ ఉప్పలపాడు శివారులో రాత్రి బస నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జరుగుల వారి పాలెం, మిట్టపాలెం, దండమూడి, మానుకొండువారి పాలెం, చిలకలూరిపేట మీదుగా పోలిరెడ్డి పాలెం వరకూ ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగుతుందని వైసీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. చిలకలూరి పేట నియోజకవర్గంలో జగన్ పాదయాత్రను విజయవంతం చేయడానికి ఆ పార్టీనేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
- Tags
- జగన్
