ప్రజలు పవన్ని కలిశారు! ఏమైందంటే...

ఒక సమస్యతో ప్రజలు ఒక నాయకుడిని, అది కూడా ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిని కలుస్తున్నారంటే.. ఎంతో కొంత ఆ నాయకుడినుంచి తమ ఉద్యమానికి మద్దతు లభిస్తుందని , తమ తరఫున పోరాటానికి వారు ఒప్పకుంటారని ఆశిస్తారు. ఒకవేళ ఆ ప్రజల తరఫున పోరాడే ఉద్దేశం లేకపోతే.. ఆ నాయకుడు వారిని కలవడానికి కూడా సమయం ఇవ్వకుండా తప్పించుకుంటారు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషయంలో అంతా భిన్నంగా జరుగుతోంది. ఆయన ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వద్దకు వచ్చిన వారిని ఇంచుమించుగా ప్రభుత్వానికి అనుకూలంగా ఎడ్యుకేట్ చేయడానికి అన్నట్లుగా మాట్లాడడం విశేషం.
భీమవరం వద్ద నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను అక్కడ అనేక గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తున్నాయి. వైకాపా వారికి మద్దతు ఇస్తోంది. అయితే ఈ గ్రామాల ప్రజలు వచ్చి పవన్ కల్యాణ్ ను కలిసి తమ పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా కోరినట్లు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాఘవయ్య ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చిన ప్రజలు ఆక్వా పార్క్ వల్ల వచ్చే సమస్యలు అన్నీ ఆయనకు వివరించారు.
అయితే పవన్ మాత్రం.. పారిశ్రామిక అభివృద్ధికి జనసేన పెద్దపీట వేస్తుందని కానీ ప్రజలు ఇలా భయంతో బతకకూడదని పవన్ వారితో అన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పడేలా వారి వద్దకు తీసుకెళ్తానని అన్నట్లుగా రాఘవయ్య పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి వచ్చి వారి సమస్యను వినడానికి కూడా పవన్ అంగీకరించినట్లు చెప్పారు.
అయితే పవన్ కల్యాణ్ ప్రజల సమస్యను ఆలకించారు గానీ.. ప్రభుత్వానికి అనుకూలంగా వారిని ఎడ్యుకేట్ చేయడానికి తన మాటలతో ప్రయత్నించినట్లుగా ఈ భేటీ ఉన్నదని పలువురు భావిస్తున్నారు.


