ప్రగతి భవన్ లో కొలువుదీరిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన అధికారిక నివాసం ప్రగతి భవన్ లోకి గురువారం ఉదయం 5.22 గంటలకు సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. త్రిదండి రామానుజ చినజీయర్, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం, సమావేశ మందిరాలకు కలిసిన రెండు భవనాలకు ‘ప్రగతి భవన్’గా నామకరణం చేశారు. అధికార్లతో జరిపే సమావేశాలు, మంత్రులతో కొన్ని భేటీలు, విదేశీ అతిథులు వస్తే భేటీ కావడం వంటివన్నీ.. ఈ ‘ప్రగతి భవన్’లోనే జరుగుతాయి.
సమాలోచనలు, సమావేశాలు జరిపే విశాలమైన ఆధునాతన వసతులు ఉన్న భవనానికి ‘జనహిత’ అని పేరు పెట్టారు. ఈ జనహితలో రైతులు, కార్మికులు, ఉద్యోగులతో సీఎం సమావేశాలు నిర్వహిస్తారు. చిన్నస్థాయి బహిరంగ సభల వంటి కార్యక్రమాలకు ఇది అనువుగా ఉంటుంది.
మొత్తం ముఖ్యమంత్రి నివాస భవనాల ప్రాంగణం మొత్తం కలిపి 9 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఈ భవన సముదాయం నిర్మాణానికి 36 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ సముదాయంలో మొత్తం మూడు భవనాలు ఉంటాయి. ఖాళీ జాగాలు మొత్తాన్ని నందనవనంలాగా తీర్చిదిద్దారు. కేసీఆర్ జన్మనక్షత్రానికి అనువైన అనేకానేక మొక్కలను, చెట్లను తీసుకొచ్చి నాటడం ద్వారా ఈ ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నుంచి ప్రత్యేకంగా అనేక రకాల మొక్కలను తెప్పించి ఈ నందనవనాన్ని తీర్చిదిద్దడం విశేషం. ముఖ్యమంత్రి నివాససముదాయానికి చుట్టూతా ఉండే ఇదివరకటి ఐఏఎస్ అధికార్ల పురాతన నివాస భవనాల్ని ఇటీవలే కూలగొట్టించారు. ఈ స్థలంలో స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ వంటి వారికి నివాస గృహాలు నిర్మించాలని తాజాగా సంకల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
విమర్శలు షరా మామూలే
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాస సముదాయం నిర్మాణం మీద విపక్షాల విమర్శలు షరా మామూలుగానే వినిపిస్తున్నాయి. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తాం అనే హామీని పట్టించుకోకుండా... కేసీఆర్ మాత్రం 115 గదుల నివాససముదాయం కట్టించుకున్నారంటూ తెలుగుదేశం కాంగ్రెస్ లు ఆరోపిస్తున్నాయి. వాస్తు నమ్మకాలతో తన సొంత నివాసం కోసం ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు తగలేస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

