పోలవరంపై ‘పవర్’ పంచ్...!

పోలవరం ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానికో.. పార్టీకో సంబంధం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బ్రిటీష్ కాలం నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఉద్దేశం ఉందన్నారు. పోలవరం నిర్మాణం వల్ల జరిగే నష్టమెంత? లాభమెంత? అన్నది ఆలోచించాలన్నారు. పోలవరం నిధులు దారి మళ్లాయని కేంద్ర ప్రభుత్వం అనుమానించి నిధులను నిలుపుదల చేసిందన్నారు. 13 వేల కోట్లు ప్రాజెక్టుకు, 30 వేల కోట్లు పునరావాస కార్యక్రమాలకు కేటాయించాల్సి ఉంది. రకరకాల పరిస్థితుల వల్ల అంచనాలు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేయనప్పుడు కేంద్రానికి లెక్కలు చెప్పొచ్చు కదా? అని పవన్ ప్రశ్నించారు. ట్రాన్స్ ట్రాయ్ ఎవరిది? వారి క్రెడిబిలిటీ ఏంటి? రాజకీయ కారణం ఉందా? కేంద్రప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోలవరం పై శ్వేత పత్రం విడుదల చేయాలి.
అఖిలపక్షం ఏర్పాటు చేయాలి....
అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలవరం పూర్తి వివరాలను వెల్లడించాలని పవన్ డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో పోలవరం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని పవన్ చెప్పారు. ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయినా తామే కట్టుకుంటామని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఉంచాలి గాని ఎందుకు తీసుకున్నారన్నారు. పునరావాస చట్టం ప్రకారం అంచనా పెరిగిందంటున్నారు. 2014 లోనే పునరావాస చట్టం వచ్చింది కదా? అప్పుడు కేంద్రాన్ని ఎందుకు కోరలేదన్నారు. పోలవరం విషయంలో అనేక సందేహాలున్నాయని, వీటిని నివృత్తిని చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలినే పవన్ ఎక్కువగా తప్పుపట్టారు.

