పోలవరం...బాబు కలవరం...?

పోలవరం ప్రాజెక్టు చంద్రబాబును కలవరపెడుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని నిన్నటి వరకూ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు. కేంద్రప్రభుత్వం సహకారం లభించకపోతుండటంతో ఆయన ఈ విషయంలో కొంత వెనక్కు తగ్గారు. తాజాగా పోలవరం నిధులపై కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్ గడ్కరీకి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిధులు పెండింగ్ లో ఉన్నందున నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశముందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో పదవి ఖాళీగా ఉందని దానిని వెంటనే భర్తీ చేయాలని, లేకుంటే పనులకు ఆటంకం కలుగుతుందని ఆయన లేఖలో నితిన్ గడ్కరీని కోరారు. నితిన్ గడ్కరీని స్వయంగా చంద్రబాబు కలిసినా ప్రయోజనం లేకపోవడంతో ఇక లేఖలు రాయడం ప్రారంభించారు.
బీజేపీ కూడా ఎక్కడా తగ్గకుండా....
మరోవైపు పోలవరం పై బీజేపీ కూడా గట్టిగానే ఉంది. బీజేపీ నేతలు కూడా పోలవరం ప్రాజెక్టును సీరియస్ గా తీసుకున్నారు. పోలవరం ఘనత టీడీపీ ఖాతాలోకి వెళ్లకుండా బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి నితిన్ గడ్కరీని, జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్ సింగ్ ను కలిశారు. పోలవరం పనులను వేర్వేరు కంపెనీలకు అప్పగించారని, ఏ కంపెనీ ఆ కంపెనీ అకౌంట్లు తెరిస్తే ఎవరికి చెల్లించాల్సిన డబ్బు వారికి చేరుతుందని పురంద్రీశ్వరి అభిప్రాయపడ్డారు. సాంకేతిక నిపుణుల బృందం పరిశీలించిన నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే కాఫర్ డ్యామ్ పై నిర్ణయం తీసుకుంటారని పురంద్రీశ్వరి చెబుతున్నారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకెళుతున్నామని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద పోలవరం క్రెడిట్ ను కొట్టేయాలని బీజేపీ తీవ్రంగానే ప్రయత్నిస్తుండగా, టీడీపీ కూడా తానే పూర్తి చేశానని చెప్పుకోవాలని శ్రమిస్తోంది.
- Tags
- పోలవరం చంద్రబాబు

