పోలవరం గ్రౌండ్ రిపోర్ట్ ఇదే ....!

ఇటీవలే ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్ట్ పనులను వర్చువల్ రివ్యూ చేశారు. ప్రాజెక్ట్ పనులు శరవేగం అని సెలవిచ్చారు. ఇప్పటికి ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ వద్ద 50 శాతం పనులు పూర్తి అయిపోయాయని కూడా చెప్పేశారు. నవయుగ కి ప్రాజెక్ట్ పనులు అప్పగించాక... అబ్బో అనుకున్నారు. సీఎం స్టేట్ మెంట్ చూసి అంతా ఓహో అనుకున్నారు. కానీ ఇవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో కార్మికులు చాలా రోజులుగా ఆందోళన మొదలు పెట్టి పనులు నిలిపివేశారు.
గత సంక్రాంతి నుంచి ఉద్యమ బాటలో ...
గత సంక్రాంతి పండుగ ముందే పోలవరం లోని దాదాపు 3 వేలమంది కార్మికులు తమకు జీతాలు చెల్లించడం లేదని పనులు నిలిపివేశారు. గత మూడు నెలలుగా ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ స్ట్రాయి భోజనాలు పెడుతుంది తప్ప వేతనాలు ఇవ్వడం లేదని తక్షణం తమ బకాయిలు చెల్లించాలని పోరు బాట పట్టారు. అప్పటినుంచి వారు పనులకు హాజరుకావడం లేదు. తాజాగా నవయుగ కు కాంట్రాక్ట్ అప్పగించామని ఇక గుడ్ బై అంటూ ట్రాన్స్ స్ట్రాయి చెప్పడంతో తమ పరిస్థితి ఏమిటంటూ పోలవరం డ్యామ్ వద్ద ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ట్రాన్స్ స్ట్రాయి జీతాలు తక్షణం చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఇప్పటిదాకా వీరి ఆందోళన బయటకు రాకుండా చూసుకున్న ట్రాన్స్ స్ట్రాయి తో బాటు ఏపీ సర్కార్ నవ్వుల పాలైనట్లైందని పలువురు విమర్శల దాడి మొదలు పెట్టేశారు.
- Tags
- పోలవరం

