పోలవరం కాంట్రాక్టర్లకు అద్రుష్టం అంటున్న చంద్రబాబు

మామూలుగా అయితే.. ఒక కాంట్రాక్టు పని దక్కించుకోవడమే.. సదరు కాంట్రాక్టర్లకు అద్రుష్టం... లాభాలు వస్తాయి కాబట్టి! పోలవరం ప్రాజెక్టు అయినా అంతే..
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో కోణంలో దీనిని కాంట్రాక్టర్లకు వరంగా, అద్రుష్టంగా అభివర్ణిస్తున్నారు. ఆయన ఉద్దేశంలో.. పోలవరం అంతటి ప్రతిష్టాత్మకమైన గొప్ప ప్రాజెక్టును కట్టడం అనేది వారి అద్రుష్టం అని సెలవిస్తున్నారు. తన వారపు షెడ్యూలులో కేటాయించిన విధంగానే.. సోమవారం నాడు.. చంద్రబాబు హైదరాబాదునుంచి పోలవరం పనులమీద సమీక్ష నిర్వహించారు.
పోలవరం వంటి మహోన్నత ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశం రావడం మన అదృష్టమని, ఇది ఒక వరంగా నిర్మాణ సంస్థలు భావించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం పూర్తయితే చరిత్రలో అద్భుతమైన ప్రాజెక్ట్‌గా నిలిచిపోతుందని, సమీప భవిష్యత్‌లో ఇంతటి ప్రాజెక్ట్ ప్రపంచంలో ఎక్కడా నిర్మించే అవకాశం కూడా లేదన్నారు. సమస్యలు ఎన్ని వున్నా, ఆటంకాలు ఎన్ని ఎదురైనా పోలవరం పనుల వేగాన్ని పెంచి గడువు దాటకుండా నిర్మించాలని నిర్మాణ సంస్థలకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు నాబార్డ్ అంగీకరించిందని, రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు.
సోమవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిధి గృహంలో పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరాన్ని నిర్దేశిత సమయంలోగా పూర్తి కాకుండా అడ్డుకునేందుకు కొన్ని శక్తులు నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్ట్ వ్యతిరేకులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఇవ్వకుండా అన్ని అనుమతులు పొందడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తి చేయాల్సి వుందని చెప్పారు. పోలవరం నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాల్లో దాఖలైన కేసులలో ప్రభుత్వ వాదనలు సమర్ధవంతంగా వినిపించేందుకు న్యాయవాదులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే వాస్తవాలపై అవగాహన కలుగుతుందని అన్నారు. ప్రతినెల రెండు, నాలుగో సోమవారాలు ఇందుకోసం సమయం కేటాయించాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతగా శ్రమిస్తున్నది భవిష్యత్ తరాలకు తెలిసేలా ఫోటోలతో సహా రికార్డ్ భద్రపరచాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతోపాటు పోలవరం సమీపంలో అద్భుత మ్యూజియాన్ని ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మ్యూజియంలో పోలవరం చరిత్ర మొత్తం ప్రతిబింబించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఐకానిక్ వంతెనను నిర్మిస్తామని చెప్పారు. ఇక నుంచి పనులపై ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ను సమీక్షిస్తానని చెప్పారు. త్వరలోనే సివిల్ ఇంజినీరింగ్ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్ధులతో భేటీ అవుతానని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగేందుకు వీలుగా, భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇకపై సమీక్షలో ఉభయగోదావరి జిల్లా కలెక్టర్లను భాగస్వాములను చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు వివరించాల్సి వుందని స్పష్టం చేశారు. మరోవైపు పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులపైనా కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను రియల్ టైమ్‌లో తెలుసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసి మైక్రోసాఫ్ట్ సంస్థ సాయంతో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
వర్చువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా డ్రోన్ కెమేరాల సాయంతో పోలవరం ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రికి ప్రత్యక్షంగా చూపిస్తూ అధికారులు వివరించారు. ఈనెల మూడోవారం కల్లా ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన యంత్రసామాగ్రి ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరనున్నట్టు చెప్పారు. ఈ సమీక్షలో జలవనరుశాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

