పొత్తులపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

పొత్తులపై ఇప్పుడే ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పొత్తులనేవి ఎన్నికల ముందు నిర్ణయించుకునేవని, వాటిని ముందుగానే తమకు తామే నిర్ణయించుకుంటూ వ్యాఖ్యలు చేస్తే క్యాడర్ అయోమయానికి గురవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సందర్భాన్ని బట్టి ఎన్నికలకు ముందు పార్టీ నాయకత్వమే పొత్తులపై చర్చిస్తుందన్నారు. ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎవరికి తోచిన రీతిలో వారు.....
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అవసరమైతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. ఇందుకు మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీని తాము అంటరానిదానిగా చూడటం లేదన్న సంగతి తెలిసిందే. అలాగే తాజాగా పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ తో పొత్తు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయంపై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని, ఇప్పుడు ఆ ప్రస్తావన అనవసరమన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, తొలుత పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలుగుదేశం నేతలను చంద్రబాబు కోరారు.
- Tags
- చంద్రబాబు

