పొత్తు రహస్యాన్ని చెప్పేసిన చంద్రబాబు ....!

రాజకీయాలంటే చెప్పినవి చేసేవి కావు. అలా చెబితే అది రాజకీయం కాదు. రాబోయే ఎన్నికల ముందు వరకు పొత్తులు అనేవి తేల్చి ఇప్పుడు చెప్పలేం .స్ట్రేటజీ ఉంటుంది . ప్రస్తుతం బిజెపి తో పొత్తు అంశం స్తబ్దత కొనసాగుతుంది అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన వర్గంతో ముటా ముల్లె సర్దుకుని కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న పరిస్థితుల్లో డీలా పడ్డ తెలంగాణ తమ్ముళ్ళ లో జోష్ పెంచేందుకు హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. నాయకులు ఎందరు పోయినా క్యాడర్ అలాగే వున్నారని అధైర్య పడొద్దని బాబు భరోసా ఇచ్చారు. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉంటుందని చెప్పారు ఆయన.
ప్రజల్లో తిరగండి ...
కొందరు నాయకులు పార్టీకి గుడ్ బై కొట్టినంత మాత్రాన పార్టీకి నష్టం వాటిల్లదు. ప్రజల్లో తిరగండి వారి ఆదరణ పొందండి. కొత్తవారికి శిక్షణ ఇచ్చేందుకు అన్ని సౌకర్యాలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వున్నాయి. మీ భవిష్యత్తుకు నాది హామీ ఇక నుంచి ప్రతినెలా సమీక్షలు జరుపుదాం పార్టీని బలోపేతం చేద్దాం అని దిశా దశా ప్రకటించారు చంద్రబాబు. అధినేత ప్రసంగం సంచలన వ్యాఖ్యలు ఏమి లేకుండా చప్పగా సాగినా టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, మోత్కుపల్లి నరసింహులు బాబు ముందు ఆవేశపూరిత ప్రసంగాలు సాగించారు. మోత్కుపల్లి తెలంగాణ అంతా బాబు ఒకసారి రథయాత్ర గా పర్యటిస్తే చాలన్నారు. ఇలా తెలంగాణ తెలుగు తమ్ముళ్ళకు చంద్రబాబు ఓదార్పు యాత్ర చేశారు.
బాబు డోస్ ఫలిస్తుందా ...?
ఓటుకి నోటు కేసుకు ముందు తరువాత చంద్రబాబు తీరును గమనిస్తే తెలంగాణాలో తెలుగుదేశం కోలుకోవడం ఇప్పట్లో అయ్యేపనిలా కనిపించడం లేదు. ఆ కేసుకు ముందు పదేళ్ళపాటు హైదరాబాద్ వదిలి పెట్టేది లేదని ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో అయ్యాకే వెళ్లాలన్న సంకల్పాన్ని బాబు వ్యక్తం చేసేవారు. దానికి అనుగుణంగానే కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి లేక్ వ్యూ అతిధి గృహాన్ని సచివాలయాన్ని సైతం ఆయన మరమ్మత్తులు చేయించారు. ఇవన్నీ పూర్తి అయ్యే లోపు ఓటుకు నోటు కేసు టిడిపి అధినేత కే చుట్టుకునేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా బిగించ గలిగారు. వెంటనే ఏర్పడ్డ సంక్షోభంతో బిజెపి పెద్దలు ఇద్దరి మధ్య రహస్య అవగాహనా కుదిర్చారన్నది పొలిటికల్ టాక్. ఆ పంచాయితీలో బాబు ఉన్నఫళంగా ఏపీకి బిచాణా ఎత్తేయాలన్నది ఒప్పందం. అంతర్గత ఒప్పందం బయటకు పూర్తిగా లీక్ కాకుండానే చంద్రబాబు విజయవాడ వచ్చేశారు. అప్పటినుంచి తెలంగాణా కు అడపాదడపా రావడం తప్ప జిల్లాల వారీగా చంద్రబాబు ఏపీలో పర్యటించినట్లు పర్యటించడం కానీ , కనీసం నెలకోసారి పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యింది లేదు.
సన్నగిల్లిన విశ్వాసం ....
తమ జాతీయ అధ్యక్షుడు ఎన్ని చెప్పినా తెలంగాణ టిటిడిపి లో విశ్వాసం లేకుండా పోయింది. టిఆర్ ఎస్ తో పొత్తు ఉండొచ్చని లేక బిజెపితో పొత్తు కొనసాగక ఒంటరిగా టిడిపి పోటీ చేయొచ్చని ఇలా ఏమి చేసినా ఆంధ్రా పార్టీ ముద్ర కేసీఆర్ ఎత్తుగడల ముందు టిడిపి గత వైభవం అందుకోవడం కలే అన్ని తమ్ముళ్ళు బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు టిటిడిపి ని నడిపేందుకు నిధులు ఇవ్వకపోతే ఈ పాటికే బోర్డు తిరగేసి పరిస్థితి ఎదురయ్యేది అని ఆ పార్టీ సీనియర్ నేతలే ఆఫ్ ది రికార్డ్ గా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజా ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి ...
- Tags
- చంద్రబాబు

