పేరు మార్చి... రూటు మ్యాప్...!

అఖిలపక్షం సమావేశం కాదని, అఖిల సంఘాల సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలూ లేవని, అందుకోసం ఏపీ హామీల కోసం పోరాడుతున్న అన్ని సంఘాలను కలుపుకుని ముందుకు పోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మొత్తం 19 డిమాండ్లను కేంద్రం నెరవేర్చాల్సిందేనని చంద్రబాబు తెలిపారు. అయితే ఈ సమావేశానికి పార్టీల ప్రతినిధులతో పాటు హామీల కోసం పోరాటంచేసే వారందరినీ పిలవాలని నిర్ణయించారు.
వైసీపీ ఎటూ రాదంటూ....
వచ్చే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎటూ రాదని బాబు తేల్చి చెప్పారు. వైసీపీ రాకపోయినా సమావేశాలను సజావుగా నిర్వహించాలని, గతంలో మాదిరిగా అధికార పక్షమే ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారు. అందరినీ ఒక తాటి పైకి తెచ్చి కేంద్రంపై పోరాటం చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. వైసీపీ అధినేత జగన్ అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజీకీయాలు డ్రామా ఆడుతున్న జగన్ టీడపీ బీజేపీతో ఎప్పుడెప్పుడు తెగదెంపులు చేసుకుంటుందా? అని చూస్తున్నారన్నారు. అయితే జగన్ కల నెరవేరదని బాబు సమావేశంలో తెలిపారు.
అవిశ్వాసం వల్ల ఒరిగేదేం లేదు....
అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నది చంద్రబాబు ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీకిఎటువంటి నష్టం ఉండదని, కాకుంటే ఒక రోజు చర్చతో ముగుస్తుందన్నారు. చర్చ ముగిసిన తర్వాత ఇక దానిపై పోరాటం చేయలేని పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుందని చంద్రబాబు తెలిపారు. ఒకసారి చర్చ ముగిసిన తర్వాత ఏపీకి మద్దతిచ్చిన జాతీయ పార్టీలు ఇక ఏపీ అంశంపై తమతో కలిసి నడవవని చంద్రబాబు చెప్పారు. బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రంతో మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడటమేంటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నేతలందరూ సంయమనంతో వ్యవహరించాలని, ఎక్కడా మాట తూలవద్దని హెచ్చరించారు.
ముందుగానే కేబినెట్ సమావేశం....
ఏపీ మంత్రి మండలి సమావేశం వాస్తవానికి ఈ నెల 23వ తేదీన జరగాల్సి ఉంది. అయితే అదే రోజు ఢిల్లీకి రమ్మని ఏపీ అధికారులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరడంతో మంత్రి మండలి సమావేశం రెండు రోజులు ముందుగానే జరపాలని నిర్ణయించారు. రేపు ఉదయం ఏపీ మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కూడా కేంద్రంతో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు చర్చిస్తారు. మొత్తం మీద చంద్రబాబు ఈరోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో అఖిలపక్షం అని పేరు రాకుండా జాగ్రత్త పడుతూ అఖిల సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం విశేషం. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు పూర్తయిన తర్వాతే ఈ సమావేశం ఉండవచ్చని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద చంద్రబాబు పేరు మార్చి రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
- Tags
- చంద్రబాబు

