పెళ్లికి వెళ్లిన కేసీఆర్ ఆ పార్టీలో చిచ్చు రేపారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతపురం పర్యటన టీడీపీలో నిప్పురాజేసింది. కేసీఆర్ తో రహస్య చర్చలు జరపడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సింగరేణి ఎన్నికల్లో టీఎన్టీయూసీని లోబర్చుకోవడానికే కేసీఆర్ ఇలా తెలుగుదేశం నేతలతో సన్నిహితంగా మెలిగారని తెలంగాణ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు కేసీఆర్ పన్నిన వలలో ఏపీ తెలుగుదేశం నేతలు పడిపోయారని టీటీడీపీ నేతలు చంద్రబాబుకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దాదాపు 35 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉండటంతోనే కేసీఆర్ పరిటాల పెళ్లికి వచ్చి అక్కడ పరిటాల సమాధికి నివాళులర్పించడం, ఆ సామాజిక వర్గం నేతలతో రహస్య చర్చలు జరిపారని టీటీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రేవంత్ తీవ్ర అభ్యంతరం.....
ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పై ఫిర్యాదు చేసింది కూడా రేవంత్ రెడ్డే. ఇలా అయితే తెలంగాణ టీడీపీని ఎలా కాపాడుకోగలుగుతామని, తాము రేయింబవళ్లూ కేసీఆర్ తో కొట్లాడుతుంటే ఏపీ టీడీపీ నేతలు ఆయనతో మిలాఖత్ అయితే ఎలా అని కూడా రేవంత్ ఘాటుగానే ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతోనే చంద్రబాబు పయ్యావుల విషయంపై సీరియస్ గా ఉన్నారట. అయితే పయ్యావుల కేశవ్ మాత్రం ఇందులో తన తప్పేమీ లేదని చెబుతున్నారు. తనను కేసీఆర్ దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారని, తనంతట తానుగా ఆయన వద్దకు వెళ్లలేదని పయ్యావుల తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. కేసీఆర్ కు, తనకు మధ్య అంత రహస్య చర్చలు ఏముంటాయని కూడా ఆయన అన్నట్లు తెలిసింది. అధినేతకు ఎవరో సమాచారాన్ని తప్పుగా అందించారని కేశవ్ అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ పరిటాల శ్రీరామ్ పెళ్లికి వెళ్లి టీడీపీలో పెద్ద చిచ్చు పెట్టినట్లయింది.
- Tags
- కేసీఆర్

