పెగ్గు కోసం..యానాం...ఎందుకంటే?

రాష్ట్రంలో రాజకీయపార్టీలు అన్నీ ఇప్పుడు ప్రత్యేక హోదా బాట పట్టాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలకు ఇది తప్పడం లేదు. అలాగే తూర్పుగోదావరి జిల్లా లోని మద్యం ప్రియులు చలో యానాం పిలుపునిచ్చారు. అదేంటి అంటే అంతే మరి. తమ ట్రేడ్ మార్జిన్ 7 నుంచి 18 శాతం చెయ్యకపోతే అలమటించి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో ఉన్నామంటూ మద్యం దుకాణాలు నాలుగు రోజులపాటు నిరవధిక బంద్ ప్రకటించాయి. ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొరపెట్టుకుంటున్నా వారి వ్యధ వినే నాధుడు కనిపించకపోవడంతో తప్పని పరిస్థితిలో వారు సామూహిక బంద్ కి దిగారు. ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా నాలుగు రోజులపాటు. అన్ని రోజులు మద్యం దుకాణాలు బంద్ అయితే మద్యం ప్రియుల పరిస్థితి ఏమిటి ? ముఖ్యంగా రోజు రెండు పెగ్గులు లాగించే వారినుంచి ఏ రోజుకారోజు కొనుక్కు తాగేవారు ఈ పరిణామంతో గతుక్కుమన్నారు. దాంతో చేసేది లేక బస్సులు, బైకులు వేసుకుని తూర్పుగోదావరి జిల్లాలో వుండే యానాం బాట పట్టేశారు.
ధర తక్కువ ఖుషి ఎక్కువ ...
ఇక కేంద్ర పాలిత ప్రాంతం యానంలో ఎపి తో పోలిస్తే మద్యం ధరలు చాలా తక్కువ. అలాగే పెట్రోల్ డీజిల్ ధరల్లోనూ లీటర్ కి సుమారుగా ఆరు రూపాయలు తక్కువ. దాంతో దూరంనుంచి వాహనాల్లో వెళ్లేవారు తమ బండితో పాటు తమకూ ఆయిల్ పట్టిస్తున్నారు. శ్రమ అయినా రెండు ఆయిల్స్ ధర తక్కువ కావడంతో నష్టం లేదని ఖుషి అవుతున్నారు. దాంతో ఈ నాలుగు రోజులు ఎపి ఆదాయానికి తీవ్రంగా గండి పడుతుంది. గతంనుంచి కూడా యానాం నుంచి అక్రమ మద్యం రవాణా కొనసాగడం పరిపాటే. నిఘా విభాగాలు వున్నా అవి నిద్రావస్థలోనే జోగుతూ ఉంటాయి. ఎన్టీఆర్ హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధ సమయంలో యానాం తీరునాళ్లను తలపించేది. మద్యం ప్రియులు వేలసంఖ్యలో యానాం వచ్చేస్తుండటంతో అంతా అక్కడ కోలాహలం కనిపించేది. రెండున్నర దశాబ్దాల తరువాత మళ్ళీ మద్యం దుకాణాల బంద్ తో యానాం కళకళ లాడుతుంది.
మద్యం విక్రయిస్తే 50 వేలు జరిమానా ...
మరోపక్క తూర్పుగోదావరి జిల్లాలో బంపర్ ఆఫర్ ప్రకటించారు మద్యం వ్యాపారులు. మద్యం విక్రయాలు చాటుగా ఎవరు అమ్మినా వారిపై 50 వేలరూపాయలు జరిమానా విధిస్తామని మద్యం విక్రయదారుల సిండికేట్ హెచ్చరించింది. ఆ సొమ్ము ఎవరైతే గుట్టుగా అమ్మేవారు వివరాలు తెలుపుతారో వారికి నజరానాగా చెల్లిస్తారు. ఇంతటి పెనాల్టీ ఉండటంతో బంద్ విజయవంతంగా సాగుతుంది. మద్యం విక్రయాల్లో మార్జిన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమం ప్రభుత్వం దిగివచ్చేవరకు ఉధృతంగా కొనసాగించాలని సిండికేట్ డిసైడ్ అయ్యింది. మరోపక్క మద్యం సిండికేట్ హెచ్చరికలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి కనిపించడంలేదు. సిండికేట్ మాట వినకపోతే ప్రభుత్వమే మద్యం దుకాణాలు ప్రారంభించాలనే యోచన చేస్తున్నట్లు సర్కార్ వర్గాల్లో టాక్. దాంతో మద్యం వ్యాపారుల ఉద్యమం ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి.
