పుట్టపర్తిలో పట్టుకోసం జగన్?

వైసీపీ అధినేత జగన్ పుట్టపర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర పుట్టపర్తి నియోజకవర్గానికి చేరుకుంది. పుట్టపర్తి అనగానే సహజంగానే గుర్తొచ్చేది సత్యసాయిబాబా. సాయిబాబా జీవించి ఉన్న రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లేది. రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు సత్యసాయిబాబా ట్రస్ట్ ఈ నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ ఉండేది. అందుకే పుట్టపర్తి నియోజకవర్గంలో బాబా బతికున్నంత వరకూ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కు సమస్యల పరిష్కారం సులువుగా ఉండేది. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గానికి చీఫ్ విప్ పల్లె రఘునాధరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో పల్లె రఘునాధరెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీయే విజయం సాధించింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కడపాల మోహన్ రెడ్డిపై 1,021 ఓట్ల స్వల్ప మెజారిటీతోనే పల్లె రఘునాధరెడ్డి విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతపాటి సోమశేఖర్ రెడ్డిపై పల్లె రఘునాధరెడ్డి 6,964 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రెండుసార్లు వరుస విజయాలను అందుకున్న పల్లె రఘునాధరెడ్డి ఇటీవల మంత్రి పదవి కోల్పోయినా చంద్రబాబు ఆయనకు మరో కేబినెట్ హోదా ఉన్న చీఫ్ విప్ పదవిని ఇచ్చి తగిన గౌరవం కల్పించారు.
పుట్టపర్తి లో పర్యటన ఎందుకంటే...
అయితే ఈసారి ఎలాగైనా పుట్టపర్తిని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాధరెడ్డి, హిందూపురం ఎంపీ నిమ్మలకిష్టప్ప మధ్య ఇటీవల పెరిగిన విభేదాలు పార్టీకి లాభిస్తాయంటున్నారు. అందుకోసమే నేటి నుంచి జగన్ పుట్టపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కృష్ణాపురం చేరుకున్న జగన్ కు ఊహించని స్వాగతం లభించింది. పెద్దయెత్తున ప్రజలు జగన్ పాదయాత్ర వద్దకు తరలి వచ్చారు. అక్కడ జెండా ఆవిష్కరణ సందర్భంగా జగన్ ను చూసేందుకు వేల సంఖ్యలో తరలి రావడంతో పుట్టపర్తి యాత్ర సక్సెస్ అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ పై వ్యక్తిగతంగా విరుచుకుపడే పల్లె రఘునాధరెడ్డి నియోజకవర్గంలో జగన్ ఈసారి ఎన్ని ఓట్లు కొల్లగొడతారో చూడాలి. జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలియడంతో పల్లె రఘునాధరెడ్డి నియోజకవర్గంలో నేతలతో సమావేశమై ప్రధానంగా నెలకొన్న సమస్యలను చర్చించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు చెబుతున్నారు.
- Tags
- జగన్

