పాలిటిక్స్ లో యువశకం ప్రారంభమైందా ...?

రాజకీయాల్లో ఇక యువ శకం ప్రారంభం అయినట్లేనా ..? కంపు కొట్టే రాజకీయ వ్యవస్థను విమర్శిస్తూ కూర్చునే కన్నా అందులో ప్రవేశించి తమ సత్తా చాటాలని నేటి దేశ యువత భావిస్తుందా ? అలాంటి వారికి సోషల్ మీడియా ఆయుధంగా మారిందా ? వారసత్వ రాజకీయాలు రాజ్యమేలినా, ఎలాంటి రాజకీయ వాసనలు లేని కుటుంబాలనుంచి వచ్చి కాకలు తీరిన నేతలకే యువత సవాల్ విసురుతుందా ? అవుననే గుజరాత్ ఎన్నికలు చాటిచెబుతున్నాయి. ఇక్కడ హార్దిక్, అల్పేష్, జిగ్నేష్ ఎలాంటి అనుభవం లేకపోయినా రాజకీయ దురంధరుడు ప్రధానికి సైతం చెమటలు పట్టించారు. ఇక అల్పేష్ , జిగ్నేష్ ల విజయాలు చిన్న అంశాలేమి కావు. భారత రాజకీయాల్లో యువరక్తం ప్రవేశించబోతుందన్న సంకేతాలను అందించేవే.
సోషల్ మీడియా అలా ఉపయోగపడుతుంది ...
సామాన్యులను రాత్రికి రాత్రి సెలబ్రిటీలను చేసేయడంలో సోషల్ మీడియా అంతులేని పాత్రే పోషిస్తుంది. దాంతో సత్తా వున్న యువతరంలో మట్టిలో వున్న మాణిక్యాలు బయటకు వస్తున్నాయి. సమాజంలో సాగుతున్న దుర్మార్గాలను అనాదిగా పట్టి పీడిస్తున్న అనేక సమస్యలపై తమ అభిప్రాయాలను వినిపించి లక్షలాదిమంది మద్దతును అతి తక్కువ రోజుల్లో సంపాదించిపెడుతున్నాయి. తమ భావజాలంతో కలిసే వారంతా ఒకే వేదికపై చేరేందుకు సమూహాలుగా పోగవుతున్నాయి.
మోడీ , కేజ్రీ దారి చూపించారు ...
సోషల్ మీడియా ను వినియోగించుకుని విజయాలు ఎలా అందుకోవొచ్చో గతంలోనే చేసి చూపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అదే దారిని ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని భావిస్తున్న యువత అందిపుచ్చుకుంది. సమస్యలను వాటి పరిష్కారాలను ఎప్పటికప్పుడు జనంలో ఉంచడం అంతర్జాల వేదికలపై ఉద్యమాలు నడపడం ఇప్పుడు మహానగరాలనుంచి గ్రామ స్థాయికి చేరుకుంది. సంప్రదాయ మీడియా తో పని లేకుండా సామాజిక మాధ్యమాలను అస్త్రాలుగా మలుచుకుని యువతరం చేస్తున్న నయా యుద్హం వారిని అతి చిన్న వయసులోనే నేతలుగా మార్చేయడం విశేషం.ఈ అంశాలు సంప్రదాయ పార్టీలకు మింగుడు పడని అంశాలే అయినా మార్పు కాలం ఇచ్చే తీర్పు గా మారుతున్నాయి.
- Tags
- యువరక్తం

