పార్టీ విధాన నిర్ణయాలను ప్రకటించిన లోకేశ్

అందరూ ఊహిస్తున్నట్లుగా చంద్రబాబునాయుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు, నారా లోకేష్ కు పదవి దక్కలేదు గానీ.. పార్టీ మీద అధికారాన్ని మాత్రం ఆయన క్రమంగా పెంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తెర వెనుక నుంచి పార్టీ సమస్త విధాన నిర్ణయాలను నిర్దేశించడం వేరు, తానే చీఫ్ అన్నట్లుగా.. విధాన నిర్ణయాలను పొడిపొడిగా అయినా ప్రకటించడం వేరు. ఇన్నాళ్లూ లోకేశ్ మొదటి పాత్రలో మాత్రమే ఉంటే నారా చంద్రబాబు ప్రకటించే చీఫ్ బాధ్యతలో ఉండేవారు. అయితే ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల సందర్భంగా లోకేశ్ విధాన నిర్ణయాలను కూడా తనే ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీలో ఒక వ్యక్తికి ఒకటే పదవి ఉంటుందని నారా లోకేశ్ విస్పష్టంగా తేల్చి చెప్పారు. పనితీరు ఆధారంగా మాత్రమే వచ్చే ఎన్నికల్లో సిటింగులు కూడా మళ్లీ టికెట్ పొందే అవకాశం ఉంటుందని ఆయన ఓ అన్యాపదేశపు హెచ్చరిక జారీచేశారు.
కార్యకర్తలను పట్టించుకోని పార్టీ రాష్ట్రాన్ని కూడా పట్టించుకోదు అంటూ.. తాము 22 వేల మంది కార్యకర్తలకు శిక్షణలు ఇచ్చాం అని, పేద కార్యకర్తలకు 2 లక్షల రూపాయలకు బీమా చేయిస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.
అయితే ఇప్పుడు పార్టీలో కీలకంగా చర్చనీయాంశంగా ఉన్న సంగతి ఏంటంటే.. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే కోటాలో.. నారా లోకేశ్ కూడా మంత్రి పదవికి దూరంగా ఉండదలచుకున్నారా? అనేది అందరి సందేహంగా ఉంది. మరి ఈ విషయంలో కొన్ని రోజులు గడిస్తేగానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

