పాపం...లాలూ... కూలీ....!

పాపం... లాలూ యాదవ్.... ముఖ్యమంత్రిగా.. కేంద్రమంత్రిగా ఎన్నో సుఖాలు అనుభవించాడు. జడ్ ప్లస్ కేటగిరి మధ్య ఆయన రాజసం వెళ్లబుచ్చే వారు. కాని గడ్డి తిన్న కారణంగా ఇప్పుడు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అంతేకాదు ఆయన విలాసవంతమైన జీవితానికి మూడున్నరేళ్లు తెరపడినట్లే. లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీ సీబీఐ కోర్టు మూడున్నరేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బిర్సాముండా జైలుకు లాలూను తరలించారు.
తోటపనికి రోజు కూలీ....
అయితే లాలూ యాదవ్ ఇప్పుడు జైలులో చలికి వణికిపోతున్నారు. ఆయన ఈ విషయాన్ని జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిబంధనలను అంగీకరించవని జైలు అధికారులు తేల్చి చెప్పారు. లాలూ యాదవ్ ఇప్పుడు జైలులో తోట పని చేస్తున్నారు. లాలూ వయసును బట్టి ఆయన చేయగలిగిన పనులనే అప్పగిస్తున్నట్లు అధికారుులు తెలిపారు. తోటపని రోజూ చేస్తే లాలూ యాదవ్ కు రోజుకు 93 రూపాయల కూలీ లభిస్తుంది. తొలి రెండు రోజులూ తోట పని చేయని లాలూ ఇప్పుడిప్పుడే ఆ పనికి అలవాటు పడుతున్నారు.
బీజేపీపై నిప్పులు....
ఇక లాలూ యాదవ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. సామాజిక న్యాయం, దళితులు, వెనకబడిన వర్గాల కోసం ప్రాణాలయినా అర్పిస్తానని, కాషాయ పార్టీకి తలవంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కుట్ర వల్లనే తాను జైలు పాలయ్యానని లాలూ యాదవ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు లాలూ కేసును హైకోర్టులో సవాల్ చేసేందుకు యాదవ్ కుటుంబం సిద్ధమయింది.
పెరోల్ పై విడుదలవుతారా?
ఆదివారం లాలూ ప్రసాద్ యాదవ్ సోదరి గంగోత్రి దేవి మరణించారు. అయితే గంగోత్రిదేవి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లాలూ తరుపున కుటుంబసభ్యులు జైలు అధికారులను పెరోల్ కోరారు. గంగోత్రి దేవి మృతి చెందిందన్న సమాచారాన్ని లాలూకు చేరవేశామని తేజస్వి యాదవ్ తెలిపారు. ఆదివారం కావడంతో పెరోల్ రావడం కష్టమైంది. లాలూ యాదవ్ కన్నా నాలుగేళ్ల పెద్దదైన గంగోత్రి దేవి అంత్యక్రియలకు రేపు లాలూ హాజరయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

