పాదయాత్రతో పట్టు పెరిగిందే

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రకాశం జిల్లాలో మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఆయన ప్రకాశం జిల్లాలో దాదాపు ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించారు. కందుకూరు, కనిగిరి, మార్కాపురం, దర్శి, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గంలో పర్యటించారు. ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్రకు మంచి స్పందనే కన్పించింది. కందుకూరు నుంచి చీరాల నియోజకవర్గం వరకూ ప్రజలు బారులు తీరారు. ప్రకాశం నేతలందరూ కలిసికట్టుగా ముందుకు సాగారు. గత ఎన్నికల్లో కూడా ప్రకాశం జిల్లా జగన్ పార్టీకి అండగా నిలబడింది.
దర్శిలో అభ్యర్థి ప్రకటన....
ప్రకాశం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా జగన్ ఒక అభ్యర్థిని ప్రకటించారు. దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో అక్కడ అభ్యర్థిగా బాదం మాధవరెడ్డిని ప్రకటించారు. గత ఎన్నికలో ఓటమిపాలయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కాదని బాదం మాధవరెడ్డికి ఇవ్వడంపై జిల్లాలో పెద్దయెత్తున చర్చ జరిగింది. అయితే బూచేపల్లితో చర్చించిన తర్వాతనే బాదం మాధవ్ పేరును జగన్ ప్రకటించారని తెలిసింది. బూచేపల్లి శివప్రసాద్ ఎన్నికల్లో పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్ల జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్పష్టత ఉండాలనే....
నియోజకవర్గంలో ఇన్ ఛార్జులు గట్టిగా ఉండాలని, పోటీ చేయలేనని చెప్పిన వారిని అక్కడ ఇన్ ఛార్జిగా పెట్టినా ఉపయోగం ఉండదన్నది జగన్ భావన. అందుకోసమే శివప్రసాద్ తాను పోటీ చేసేందుకు సుముఖంగా లేనని చెప్పని వెంటనే బాదం మాధవరెడ్డిని అక్కడ ఇన్ ఛార్జిగా పెట్టారు. అంతేకాదు దర్శి కి పాదయాత్ర చేరుకున్నప్పుడు ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు. ఎందుకంటే క్యాడర్ లోనూ, ప్రజల్లోనూ ఉన్న సందిగ్దతను తొలగించేందుకు జగన్ ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ప్రకాశం యాత్ర రేపటితో...
అలాగే అద్దంకి నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు గొట్టిపాటి భరత్ కు అవకాశమిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భరత్ ను ఎమ్మెల్సీగా చేస్తానని ప్రకటించారు. అంతేతప్ప ప్రకాశంలో మరెక్కడా అభ్యర్థుల ప్రకటన చేయలేదు. జగన్ పాదయాత్ర వల్ల ప్రకాశంజిల్లాలో నేతలంతా ఐక్యంగా నడిచారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. కాగా శనివారం జగన్ పాదయాత్ర వేటపాలెం శివార్ల నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి అంబేద్కర్ నగర్, దేశాయిపేట, జాండ్రపేట, రామకృష్ణాపురం మీదుగా చీరాలకు చేరుకుంటుంది. చీరాలలో రాత్రికి జగన్ బస చేస్తారు. రేపటితో ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర ముగియనుంది.
- Tags
- జగన్ పాదయాత్ర
