పాకిస్తాన్లో సుష్మాకు జై కొడుతున్నారు!

సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్నంత మాత్రాన ఇరుదేశాల మధ్య మానవ సంబంధాలు, మానవీయత కూడా లుప్తమైపోతుందని అర్థం కాదు. ఇరు దేశాల మనుషులు కూడా పరస్పరం శతృవుల్లా చూసుకోవాలని కానే కాదు. ఈ విషయాన్నే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అధికారికంగా నిరూపించారు. అందుకే పాకిస్తాన్ లో యూత్ ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆమె ఔదార్యం, సహృదయత గురించి పాకిస్తాన్ లో సోషల్ మీడియా కీర్తిస్తున్నదంటే అతిశయోక్తి కాదు.
ఇటీవల చండీగఢ్‌లో జరిగిన ఒక గ్లోబల్ పీస్ సమ్మిట్‌కు పాకిస్తాన్ నుంచి 19 మంది అమ్మాయిలు వచ్చారు. వారు తిరిగి వెళ్లేలోగా ఇరుదేశాల మధ్య పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయిల్లో ఆందోళన పెరిగింది. వారిలో ఒకరు నేరుగా సుష్మాను కలిసి, సాయం అడిగారు.
అయితే పాకిస్తాన్ అమ్మాయిలు అయినంత మాత్రాన వారు కూడాతన బిడ్డల్లాంటి వారే అని వ్యాఖ్యానిస్తూ.. అమ్మాయిలు ఎవరికైనా అమ్మాయిలే అని సుష్మాస్వరాజ్ వారికి ప్రత్యేక భద్రత ఏర్పాటుచేసి.. క్షేమంగా స్వదేశం చేరడానికి ఏర్పాట్లు చేశారు.
సుష్మ వ్యవహరించిన తీరు, తీసుకున్న జాగ్రత్తల పట్ల ఇప్పుడు అక్కడ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి భారత కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే 'ఆధారాలు చూపాలనే' ప్రకటన ద్వారా కేజ్రీవాల్ పాక్ లో క్రేజ్ సంపాదించుకుంటే.. పాక్ బిడ్డలు మా బిడ్డలే అన్న స్ఫూర్తి భావనను పంచుకుని.. సుష్మాస్వరాజ్ మరో రకంగా అక్కడ జనాదరణ సంపాదించుకున్నారు మరి!!

