పవర్ స్టార్ నే ఏడిపించిన నిర్మాత ..?

ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ డమ్మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారా ? ఆయనను ఎవరు పట్టించుకునే వారే కాదా ? అల్లు అరవింద్ పవర్ సెంటర్ దెబ్బకి పవర్ స్టార్ కన్నీళ్లు పెట్టుకునే వారా ? తనను ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేసిన వారిపై పగతోనే పవన్ పార్టీ పెట్టేశారా ? ఇలాంటి అనేక సందేహాలకు స్వయంగా పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చి తెరదించారు. అల్లు అరవింద్ కి అల్లు అర్జున్, రాంచరణ్ స్థాయిలోనే ఒక నటుడిగా మాత్రమే పవన్ భావించేవారుట. ఎక్కడికైనా ముఖ్యమైన పనికి పవన్ ని పంపిద్దామనుకున్నప్పడు రాంచరణ్ , అల్లు అర్జున్ సరిపోతారంటూ అరవింద్ చెప్పేవారని పికె చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో ప్రజారాజ్యంలో జరుగుతున్న వ్యవహారాలూ చూసి ఏడ్చేవాడినని పవన్ చెప్పడం గమనార్హం. దానిని బట్టి పవన్ కళ్యాణ్ కు నాటి చిరంజీవి పార్టీలో డమ్మీ ని చేశారన్నది ఆయన మాటల్లో వ్యక్తం అయ్యింది.
ఆరోజు పవన్ ఉంటే పరకాల పరిస్థితి ఘోరంగా ఉండేదట ...
ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలోనే ఆ పార్టీని వీడి వెళ్లేప్పుడు పరకాల ప్రభాకర్ పెట్టిన ప్రెస్ మీట్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. పరకాల ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో తాను ఉండి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండి ఉండేదని ఈ రోజుకు అందరు మర్చిపోలేని విధంగా ఏదో ఒకటి చేసి వుండే వాడినని పికె చెప్పడం విశేషం. ఈ మాటలు అంటూనే పరకాల దమ్మున్న వారని ఆయన భార్య కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పలుకుబడి వుపయోగించి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేక పోయారని తప్పు జరుగుతుంటే ఆయన నోరు ఇప్పుడు ఎందుకు లేవడం లేదన్నారు. ఇలాంటి వారు రాజకీయాలకు దూరంగా ఉండటం మేలంటు సలహా కూడా ఇచ్చారు పవన్. మొత్తానికి అటు అల్లు అరవింద్, ఇటు పరకాల ప్రభాకర్ వివాదాలు పదేళ్ళు అయినా పవన్ నేటికీ మర్చిపోలేకపోవడం గమనార్హం

