పవర్ పాలిటిక్స్ లో వేగం పెంచిన కాంగ్రెస్ ...!

తెలంగాణ కాంగ్రెస్ జోష్ మీద వుంది. కేసీఆర్ ఏమి చేసినా ఆయన తప్పుల లెక్కల చిట్టా విప్పి ఉతికి ఆరేసే పనిలో సీరియస్ గా నిమగ్నమైంది. గత నెల్లో మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు కూడా కాంగ్రెస్ క్షేత్ర పరిశీలన చేసి హడావిడి చేసింది. ఆ తరువాత మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై నిజాలు ఇవే అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కేసీఆర్ సర్కార్ ను ఉతికేసింది. మెట్రో ప్రాజెక్ట్ ఘనత తమదేనని కేసీఆర్ సర్కార్ నిర్లక్యం వల్లే ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యిందని ఆరోపించింది. తాజాగా ఇప్పుడు అదే దూకుడులో రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు ఇవ్వడం నాడు కాంగ్రెస్ వేసిన పునాదిగా మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి క్రెడిట్ కోసం పరితపించింది.
అప్పుడు శ్రవణ్ , ఇప్పుడు షబ్బీర్ షో...
మెట్రో రైల్ ప్రాజెక్ట్ వ్యవహారంపై శ్రవణ్ పవర్ పాయింట్ ఇవ్వగా తాజాగా మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ పవర్ పాయింట్ ఇచ్చారు. రాష్ట్రానికి ఏర్పడనున్న విద్యుత్ కష్టాలు ముందే గుర్తించి కాంగ్రెస్ అనేక విద్యుత్ ప్రాజెక్టులు గతంలో సంకల్పించిందని లెక్కలతో చూపించింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకా తెలంగాణాలో విద్యుత్ ఉత్పాదన ఏమి కొత్తగా జరిగింది లేదని విమర్శలు గుప్పించింది. ఛత్తీస్ ఘడ్ నుంచి యూనిట్ కి ఐదురూపాయలకు పైబడి కొనుగోలు చేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఘనత సాకారం కావడానికి కాంగ్రెస్ విజన్ కారణమని ఆ పార్టీ చెప్పుకొచ్చింది. మొత్తానికి తెలంగాణ లో పవర్ పాలిటిక్స్ ను కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి.
- Tags
- కాంగ్రెస్

