పవన్ తిట్టినా మాకు ఓ.కే.

పవన్ కళ్యాణ్ విశాఖ, రాజమహేంద్రవరం వేదికల నుంచి బిజెపికి ఇచ్చిన పంచ్ లు మాములుగా లేవు. ప్రత్యేక హోదా విషయంలో నిలదీశారు. నేరుగా విశాఖ ఎంపీ హరిబాబు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ప్రత్యేక హోదా విషయంలో ఏమి చేయలేరా అని నిలదీశారు. మోడీ సర్కార్ పై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని కడిగేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ అంశంలోనూ కేంద్రం వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి కుల, మత రాజకీయాలను ప్రజలపై ప్రయోగిస్తుందని విమర్శించారు. ఇలా అనేక అంశాలపై పవన్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
సన్నాయి నొక్కులు నొక్కిన బిజెపి నేతలు ....
వీటిపై కమల నాథులు సుతిమెత్తగా స్పందించారు. ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు, బిజెపి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు, పురంధరేశ్వరి సైతం ఆచితూచి మాట్లాడారు. తాను 42 ఏళ్లగా రాజకీయాల్లో ఉండి సమస్యలపై స్పందిస్తున్నా అని తనకన్నా ఎవరైనా ఇంకా బాగా స్పందిస్తే సంతోషమన్నారు హరిబాబు. అదే రీతిలో విష్ణు కుమార్ రాజు, పురంధరేశ్వరి జనసేనాని నొచ్చుకొని రీతిలోనే స్పందించి స్పందించినట్లు మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. రాబోయే ఎన్నికల్లో జనసేన తో వీలయితే మిత్రత్వం జరపడానికి వీలుగా పవన్ పై వీరు విమర్శలు ఎక్కు పెట్టలేదని తాజా పరిణామాలపై విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి సైతం అదే తీరులో వ్యవహరిస్తోంది. ఒక్క వైసిపి మాత్రం పవన్ పై అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసింది.

