పవన్ మౌనం ఇందుకేనా?

ప్రశ్నిస్తా...ప్రశ్నిస్తా...అంటూ ప్రశించిపోయారు. రెండు రాష్ట్రాల సమస్యలు తనకు ముఖ్యమని, ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వాలను ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగినా నోరు మెదపలేదు. ముఖ్యంగా ఏపీ విషయంలో జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, కామ్రేడ్లు, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్టీ పెట్టానని, అధికారం కోసం కాదని చెప్పిన పవన్ కల్యాణ్ చివరకు సమయం వచ్చే సరికి పత్తా లేకుండా పోయారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
ప్రశ్నించడం కోసమే....
పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజులపాటు పర్యటించారు. ముఖ్యంగా ఏపీలోని అనంతపురం జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించిన పవన్ కల్యాణ్ అక్కడి సమస్యలపై ప్రత్యేక రైలులో ప్రధాని మోడీ వద్దకు తీసుకెళతానని హామీ కూడా ఇచ్చారు. తాను అధికారం కోసం రాలేదని, ప్రజల పక్షాన ప్రశ్నించడానికే వచ్చానని పవన్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే కేంద్ర బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాల నోట్లో మట్టి కొట్టినా పవన్ కల్యాణ్ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మౌనంపై విమర్శలు...
జనసేనాని మూడురోజుల పర్యటన అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. రోజూ పార్టీ కార్యాలయానికి వచ్చివెళుతూ ఉన్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన పవన్ ప్రత్యేక ప్యాకేజీకి, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా, విశాఖ రైల్లే జోన్ విషయం ప్రస్తావించకుండా సాగిపోయిన బడ్జెట్ పై మాత్రం పెదవి విప్పలేదు. దీంతో పవన్ సీరియస్ రాజకీయాలు చేయడం లేదన్నది అర్థమైపోయిందంటున్నారు విశ్లేషకులు. ఒకవైపు ఏపీలోని అన్ని పార్టీలూ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి గళమెత్తుతుంటే పవన్ మౌనంగా ఉండటం మంచిదికాదంటున్నారు జనసైనికులు. ఇప్పటికైనా పవన్ స్పందించకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందంటున్నారు. అయితే బడ్జెట్ ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే స్పందిస్తే బాగుంటుందని పవన్ అభిప్రాయపడుతున్నట్లు జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరి పవన్ దీనిపై స్పందించకుంటే రాజకీయాల్లో పార్ట్ టైం అని చెప్పక తప్పదు.
- Tags
- పవన్ కల్యాణ్

