పవన్ మనసు మార్చుకున్నారా...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్లీనరీని నిర్వహించి తర్వాత ప్రజల్లోకి రథయాత్ర ద్వారా వెళదామనుకున్నారు. కాని ప్రజాసమస్యలు తెలుసుకుని, వాటిని ప్లీనరీలో చర్చించాలంటే తొలుత యాత్ర చేయడమే మంచిదని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యనేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్ రధయాత్రకు ఏర్పాట్లు చేయడంటూ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి డిసెంబర్ లో ప్లీనరీ నిర్వహించి జనవరిలో రథయాత్ర చేయాలన్నది పవన్ తొలుత భావించారు. ఈ మేరకు ప్లీనరీ ఏర్పాట్లు చేయాలని కూడా కోరారు. కాని లండన్ నుంచి వచ్చిన పవన్ మనసు మార్చుకున్నారు.
వచ్చే నెలలో రధయాత్ర?
ప్రజాసమస్యలు తెలుసుకోకుండా ప్లీనరీ నిర్వహించి ప్రజలకు ఏమి చెప్పాలని ఆయన ముఖ్య నేతలను ప్రశ్నించారు. అందుకోసమే తొలుత రెండు తెలుగు రాష్ట్రాల్లో రధయాత్రకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో డిసెంబరు చివరి వారంలోనే పవన్ రధయాత్ర ఉండే అవకాశముంది. తొలుత ఆంధ్రప్రదేశ్ నుంచి యాత్రను పవన్ ప్రారంభించనున్నారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని తర్వాతనే ప్లీనరీని నిర్వహిద్దామని పవన్ తెలిపారు. దీంతో పార్టీ నేతలు రధయాత్ర కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రధయాత్ర ఎప్పుడనేది మరికొద్ది రోజుల్లో స్పష్టం కానుంది.
- Tags
- పవన్ కల్యాణ్

