పవన్ ఫుల్లుగా ఇక దీనిపైనే ఉన్నట్లుందే...!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి సమయాన్ని పార్టీకే కేటాయించనున్నారు. అజ్ఞాతవాసి సినిమా పూర్తి కావడంతో గత కొద్ది రోజుల నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు. ప్రతి రోజూ ఠంచన్ గా పవన్ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని తన కార్యాలయంలో పార్టీ పరిస్థితిని, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ముఖ్యలు, సన్నిహితులతో చర్చిస్తున్నారు. పవన్ కల్యాణ్ వచ్చే నెల నుంచి చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
శిక్షణ కార్యక్రమాల్లో....
అయితే ఇప్పటికే జనసైనికుల ఎంపిక ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా పూర్తయింది. వీరికి హైదరాబాద్ లోనే జనవరి నెలలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు అవసరమైన నిపుణుల జాబితాను కూడా పవన్ పరిశీలించారు. పవన్ కూడా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ పెట్టిన ఉద్దేశ్యాన్ని, పార్టీ ఎజెండా ఎలా ఉండబోతోంది? వచ్చే ఎన్నికలకు ఏం చేయాలన్న దానిపై ఎంపికైన జనసైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు.
వచ్చే నెలలో మళ్లీ టూర్....
అయితే జనవరి నెల నుంచి మళ్లీ ఏపీలో పవన్ పర్యటిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఇటీవల నాలుగు రోజులు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలులో పర్యటించినప్పుడు మంచి స్పందన కన్పించింది. దీంతో మరోసారి మిగిలిన జిల్లాల్లో పర్యటించాలని పవన్ భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో వపన్ పర్యటించే అవకాశముందని పార్టీ ముఖ్యుడొకరు తెలిపారు. కడప, అనంతపురం జిల్లాల్లో జనవరి నెలలో పవన్ పర్యటన ఉంటుందన్నారు. అలాగే ప్లీనరీపై కూడా పవన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి జనసేనాని జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నమాట.
- Tags
- పవన్ కల్యాణ్

