పవన్ క్రిమినల్ మాయలో పడ్డాడా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాయలో పడ్డారా? తన క్రేజ్ ను, రాజకీయంగా తనకు ఉన్న స్వచ్చత పేరును అడ్డగోలుగా వాడుకుని లబ్ధి పొందదలచుకున్నవారు ఆయనను బురిడీ కొట్టించారా? ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యే రామానాయుడు చెబుతున్న మాటలు వింటే అలాగే అనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమవరం ఆక్వా రైతులకు మద్దతుగా కొత్త ఉద్యమానికి సిద్ధపడుతున్నా సంగతి తెలిసిందే. రైతులను పవన్ వద్దకు తీసుకురావడం, ప్రెస్ మీట్ పెట్టి మద్దతు ప్రకటించేలా కోఆర్డినేట్ చేయడం ఈ పని మొత్తం విశ్వ మానవ వేదిక అనే సంస్థ చేసింది. ఈ పేరిట స్వచ్చంద సంస్థ నడుపుతున్న మాజీ జర్నలిస్టు ఈ బాధ్యత తీసుకున్నారు. పవన్ ప్రెస్ మీట్ పెట్టేలా ప్రేరేపించిన వారిపై ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు చెలరేగుతున్నారు.
పవన్ ను తీసుకువచ్చిన వ్యక్తి ఒక క్రిమినల్ అని రామానాయుడు నిప్పులు చెరిగారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే పవన్ ను అడ్డు పెట్టుకుంటున్నారని విమర్శించారు. కొందరు స్వార్ధం కోసం రాజకీయం చేస్తున్నారు అని అయన విమర్శించారు. మరి ఈ విమర్శలపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.

