పవన్ కు ఇది మంచి అవకాశమే మరి ...!

జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు మంచి అవకాశం ఎదురువచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తిరుపతి, కాకినాడ సభల్లో నిప్పులు చెరిగిన తీరులో మరోసారి పవన్ కళ్యాణ్ గళం ఇరు రాష్ట్రాల్లో విప్పితే కొత్త పార్టీకి జనంలో ఆదరణ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో బిజెపి తరపు ప్రచారం చేపట్టిన పవన్ ప్రత్యేక హోదా అంశంలో మోడీ సర్కార్ మోసం చేసిందని ఆ పార్టీ కి దూరమయ్యారు. ఇప్పుడు ఆయన బడ్జెట్ అస్త్రాన్ని నేరుగా కేంద్రంపై సంధించాలిసిన టైం వచ్చేసింది. కేసీఆర్, చంద్రబాబు, జగన్ మోడీ అనుకూల వైఖరి తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం తెస్తుంది. ఈ దశలో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ ఇమేజ్ వున్న నేత ఈ అంశంపై ఎలా వ్యవహరిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇంత జరుగుతున్నా ....
తెలుగు రాష్ట్రాల్లో ప్రజల గోడు వినిపించే కొత్త గొంతుక వచ్చిందని యువరక్తం ఉరకలు వేసింది. ట్విట్టర్ పార్టీ గా పేరొందిన జనసేన గత నెలనుంచి స్పీడ్ అందుకుంది. అజ్ఞాత వాసి చిత్రం తరువాత ఇక పూర్తి స్థాయి రాజకీయాలు అన్న పవన్ తెలంగాణ లో మూడు రోజులు, ఏపీలో మూడు రోజులు టూర్ చేసి మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కీలకమైన బడ్జెట్ వంటి సమయంలో తన వైఖరి ఆయన స్పష్టం చేయాలి. అదీ రెండుమూడు రోజులు తరువాత కాదు. తక్షణమే స్పందించడం జనసేనాని కర్తవ్యం. మరి పవన్ అలా చురుగ్గా వ్యవహరించలేకపోవడానికి కారణం ఏమిటో జనసైనికులకు అర్ధం కావడం లేదు. అయోమయాన్ని వీడి రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకోసం పవన్ వంటి వారు ఉద్యమం గా మలుచుకుని తన పార్టీ నిర్మాణం సాగించాలి. కానీ ఆయన ఇలాంటివి అందిపుచ్చుకోవడంలో విఫలం చెందారా ? లేక మోడీ సర్కార్ కి భయపడుతున్నారా అన్నది జనసేనానే తేల్చాలి.
- Tags
- పవన్ కల్యాణ్

