పవన్ ఈ నిర్ణయం కరెక్టేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్... నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో నలుమూలలా పర్యటించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలను కవర్ చేశారు. పలు సమస్యలపై ఆయన స్పందించారు. బాధితులను ఓదార్చారు. కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారికి తాను వస్తున్నానని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. అభిమానం కాదు... అరుపులు కాదు.... వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఉండాలని ఫిల్మ్ స్టార్ ఫక్తు పొలిటికల్ లీడర్ గా మారిపోయారు. అంతా బాగానే ఉంది. ఈ సమయంలోనే తాను ఇక సినిమాల్లో నటించనని కూడా అభిమానులు షాక్ కు గురయ్యే వార్త చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం అజ్ఞాత వాసి చిత్రంలో నటుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. అయితే ఇదే సమయంలో మరో రెండు సినిమాలను అంగీకరించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. రెండు సినిమాలంటే... ఏకబిగిన షూటింగ్ చేసినా 8 నెలల సమయం తీసుకుంటుంది. అంటే అజ్ఙాతవాసి సినిమాతో ఆయన మేకప్ కు ప్యాకప్ చెప్పేస్తారా? లేక మరో రెండు సినిమాలు చేసి సినిమాలకు స్వస్తి చెబుతారా? అన్నది క్లారిటీ రాలేదు.
ఎన్నికలకు ఎంతో సమయం లేదు....
మరోవైపు ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. 2019 లో ఎన్నికలు జరిగినా ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. అంగీకరించిన రెండు సినిమాలు చేస్తే ఎనిమిది నెలలు షూటింగ్ కే సమయం తీసుకుంటుంది. అందుకనే అజ్ఞాతవాసి సినిమా విడుదల అయిన తర్వాత పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారన్నది జనసేన పార్టీ వర్గాల టాక్. జనవరి నెలలో ఎంపక చేసిన జనసేన కార్యకర్తలకు శిక్షణ తరగతులుంటాయని పవన్ ప్రకటించారు. అంతేకాదు మార్చిలో ప్లీనరీ కూడా ఉంటుందని చెప్పారు. అంటే ఇక అజ్ఞాతవాసి చివరి సినిమాయేనన్నది జనసేన పార్టీ నేతల అభిప్రాయం. పవన్ ఫ్యాన్స్ మాత్రం మరో రెండు సినిమాలు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
అన్న చిరు బాటలోనే....
అయితే సినిమాలకు పవన్ శాశ్వతంగా దూరమవుతారా? లేక చిన్న గ్యాప్ ఇస్తారా? అన్నది తెలియరాలేదు. పవన్ చెప్పిన ప్రకారం 2019 ఎన్నికల వరకూ పవన్ కల్యాణ్ సినిమాలు చేయరనేది వాస్తవం. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలను బట్టి పవన్ కల్యాణ్ తిరిగి మేకప్ వేసుకోవాలా? లేక రాజకీయాల్లోనే కంటిన్యూ కావాలా? అన్నది తేల్చుకోవాల్సి ఉంటుంది. మెగా స్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చాక దాదాపు పదేళ్లపాటు మేకప్ వేసుకోలేదు. ఇక పాలిటిక్స్ మీద విసుగుపుట్టిన చిరు బుల్లితెర, వెండితెరపై కన్పించారు. ఆయన ప్రస్తుతం తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయారు. పవన్ పరిస్థితి కూడా అన్నలాగే ఉంటుందా? 2019 ఎన్నికల తర్వాత తిరిగి సినిమాలు చేస్తారా? లేదా? అన్నదే పవన్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న.
- Tags
- పవన్ కల్యాణ్

