పరామార్శకు వెళ్లి ప్రమాదానికి గురైన హోంమంత్రి చినరాజప్ప

పెద్దాపురం గ్యాస్ లీక్ ప్రమాదంలో బాధితులను పరామర్శించడానికి కాకినాడలోని సంజీవని ఆస్పత్రికి వెళ్లిన ఏపీ హోంమంత్రి చిన రాజప్ప ప్రమాదానికి గురయ్యారు. ఆస్పత్రిలో లిఫ్ట్ లో ఆయన కిందికి దిగుతుండగా, లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో.. అది ఒక్కసారిగా దఢేల్న కిందకు పడింది. ఈ ప్రమాదంలో లిఫ్ట్‌లో చినరాజప్ప పడిపోయారు. స్వల్ప గాయాలకు గురయ్యారు. ప్రమాదం జరిగింది ఆస్పత్రిలోనే కావడంతో.. సంజీవని ఆస్పత్రి సిబ్బంది ఆయనకు తక్షణం వైద్యసహాయం అందించారు.
తిమ్మాపురం రొయ్యల పరిశ్రమలో గ్యాస్ లీక్ అయి దాదాపు వందమంది వరకు అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడానికి చినరాజప్ప వెళ్లారు. వారికందరికి మంచి వైద్యసేవలు అందించాలని ఆస్పత్రి వారిని ఆదేశించారు. అక్కడినుంచి తిరిగి బయల్దేరినప్పుడు ఆయన లిఫ్ట్ లో కిందికి వస్తుండగా.. ఆ లిఫ్ట్ వైర్ తెగిపోయింది. లిఫ్ట్ ఒక్కసారిగా పడిపోవడంతో.. హోంమంత్రి స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆయనతో పాటు భద్రత సిబ్బంది కూడా ఉన్నారు.

